హైదరాబాద్‌లో పండగ కళ: బయలుదేరిన గాంధీ కుటుంబం
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఇంకొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. రాత్రికి హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. ఈ మధ్యాహ్నం 1:04 నిమిషాలకు లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్లు తరలి రానున్నారు.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియాకు చెందిన కొందరు నేతలు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది.
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో- హైదరాబాద్‌లో పండగ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీభవన్‌ను అందంగా ముస్తాబు చేశారు. విద్యుద్దీపాలతో అలంకరించారు. రేవంత్ రెడ్డిని అభినందిస్తూ జంట నగరాల్లో పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి.

ప్రమాణ స్వీకారానికి వేదికగా మారిన ఎల్బీ స్టేడియానికి దారి తీసే మార్గాలన్నీ కాంగ్రెస్ పార్టీ జెండాలతో నిండిపోయాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డిలకు సంబంధించిన భారీ కటౌట్లను నెలకొల్పారు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా.. హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ ఉదయం 10: 30 గంటలకు వారు హైదరాబాద్‌కు చేరుకుంటారని, ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications