రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు; సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగలేఖ
తెలంగాణా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన రేవంత్ రెడ్డి ఆ లేఖలో రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పత్తి రైతుల, మిర్చి రైతుల పరిస్థితి తనను ఎంతో కలచివేసిందని పేర్కొన్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సరైన వ్యవసాయ విధానం లేదని లేఖలో స్పష్టం చేశారు.

రైతులు అప్పులపాలై దిక్కుతోచని స్థితిలో ఉన్నారు: రేవంత్ రెడ్డి
రైతులకు రుణ ప్రణాళిక, పంటల కొనుగోళ్లు, పురుగుమందులు, నకిలీ విత్తనాలు, కల్తీ విత్తనాలు ఇలా అనేక రకాల సమస్యల నేపథ్యంలో రైతులు అప్పులపాలై దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇటీవల తాను మహబూబాబాద్ ప్రాంతంలో పర్యటించి వచ్చానని, ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నానని లేఖలో పేర్కొన్న రేవంత్ రెడ్డి రైతులు అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వెల్లడించారు.

మహబూబాబాద్ జిల్లాలో రెండు నెలల్లోనే 20 మంది రైతులు ఆత్మహత్య
ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే రెండు నెలల్లో 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో కెసిఆర్ అర్థం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అప్పుల బాధతోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, రైతులను అప్పుల ఊబి నుంచి గట్టెక్కించేలాగా ప్రభుత్వ ప్రణాళికలు ఉండాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇటీవల మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక లు మహబూబాబాద్ ప్రాంతాల్లో పర్యటించి నివేదికలు సమర్పించాయని రేవంత్ రెడ్డి లేఖ లో స్పష్టం చేశారు.

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 25 లక్షల నష్ట పరిహారం అందించాలి
ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని పేర్కొన్న రేవంత్ రెడ్డి తక్షణం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. రైతులను ఆదుకోవాలని, రైతు వేదికలను పునరుద్ధరించి, వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించి వారికి కావాల్సిన సలహాలు, సూచనలు ఇస్తూ రైతులు నష్టపోకుండా కాపాడాలని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

కేసీఆర్ కు రైతాంగ సమస్యలపై బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి
ఇప్పటికే రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై అనేకమార్లు సీఎం కేసీఆర్ ను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం అన్ని చర్యలు చేపట్టామని చెప్తున్న కేసీఆర్ మాటలు పచ్చి బూటకం అని మండిపడ్డారు. రైతుల సంక్షేమానికి కేసీఆర్ పెద్ద పీట వేస్తే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ రైతులను మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతాంగసమస్యలను పరిష్కరించటంపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. రైతుల పట్ల కేసీఆర్ నిర్లక్ష్య వైఖరి వల్లే రైతుల మరణాలు పెరిగిపోయాయని ఆయన ఆరోపిస్తున్నారు. తాజాగా మరోమారు కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసి రైతుల సమస్యలపై అనేక డిమాండ్లు వినిపించారు రేవంత్ రెడ్డి.












Click it and Unblock the Notifications