ప్రమాదంలో రేవంత్ రెడ్డి ఫ్లోర్ లీడర్ పదవి: ఉండేనా, ఊడేనా?
హైదరాబాద్: తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి ఫ్లోర్ లీడర్ పదవి ప్రమాదంలో పడింది. అది ఉంటుందా, ఊడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టిడిపి శాసనసభా పక్ష నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరడంతో రేవంత్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ పదవిలో నియమించారు.
శాసనసభాపక్షం నాయకుని గా ఉండేందుకు, స్పీకర్ గుర్తించేందుకు ఏ పార్టీకైనా ఐదుగురికి తగ్గకుండా ఎమ్మెల్యేలు ఉండాలి. అప్పుడే ఆ పార్టీ పక్షం నాయకున్ని ఫ్లోర్ లీడర్‌గా గుర్తిస్తారు. టిడిపి నుంచి ఎన్నికైన 15 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే 10 మంది పార్టీ ఫిరాయించినందున ఇక ఐదుగురు ఎమ్మెల్యేలు మిగిలారు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఫ్లోర్ లీడర్ పదవి దక్కుతుంది.

ఆ ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరు పార్టీ వీడినా, రేవంత్ రెడ్డి ఆ పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరూ పార్టీ వీడరని ఆ పార్టీ సీనియర్ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా పార్టీ వీడినా రేవంత్‌కు పోయేది శాసనసభాపక్షం నాయకుని హోదానే కదా అని అంటున్నారు.
అసెంబ్లీ సమావేశాల సమయంలో శాసనసభాపక్షం నాయకుల పాత్ర ప్రముఖంగా ఉంటుంది. సమావేశాల సమయంలో ఏదైనా ఇబ్బందికరమైన సమస్య తలెత్తినప్పుడు సభాధ్యక్ష స్థానంలో ఉండే స్పీకర్ అన్ని పార్టీల శాసనసభాపక్షం నాయకుల సలహాలు తీసుకుంటారు. అంతేకాకుండా పార్టీల బలాబలాల ప్రకారం ఆయా పార్టీలకు సమావేశాల్లో వివిధ అంశాలపై మాట్లాడేందుకు స్పీకర్ సమయం కేటాయిస్తారు. అందువల్ల శాసనసభా పక్ష నేత పదవి అత్యంత ముఖ్యమైంది.
అసెంబ్లీ ఆవరణలో పాలక, ప్రతిపక్షాల ఎమ్మెల్యేలకు పార్టీ లెజిస్లేచర్ కార్యాలయాలు ఉంటాయి. ఐదుగురు ఎమ్మెల్యేలకు తగ్గకుండా ఉన్న పార్టీలకే కార్యాలయాలు కేటాయిస్తారు. వామపక్షాలకు అసెంబ్లీ ఆవరణలో పార్టీ లెజిస్లేచర్ కార్యాలయాలు లేవు.
శాసనసభాపక్షంగా గుర్తింపు పొందిన పార్టీ నేతకు పర్సనల్ అసిస్టెంట్‌ను, కార్యాలయానికి అవసరమైన సిబ్బందిని, ఫోను, ఇతరత్రా సౌకర్యాలను అసెంబ్లీ అధికారులే కల్పిస్తారు. ఐదుకు ఒక్కరు తగ్గినా కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే గీత దాటినా రేవంత్ రెడ్డి పదవి ఊడుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications