నోటుకు ఓటు: రేవంత్ రాజకీయ జీవితం ఖతమ్?
హైదరాబాద్: తాను తెలంగాణ ముఖ్యమంత్రిని అవుతానని నోటుకు ఓటు కేసులో ప్రస్తుతం అరెస్టయిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఇంటర్వ్యూలో అత్యంత విశ్వాసంతో చెప్పారు. ముఖ్యమంత్రి కావడానికి తగిన పరిస్థితులు, వాతావరణం తనకు ఉన్నాయని ఆయన చెప్పారు. తెలంగాణలోని సామాజిక సమీకరణాలు తనకు ఎలా కలిసి వస్తాయో కూడా చెప్పారు. కానీ, ఇప్పుడు ఆయన రాజకీయ జీవితానికి పూర్తిగానే తెర పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలంటున్నాయి.
రేవంత్ రెడ్డి ప్రస్తుత కేసులో దోషిగా తేలితే తన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోతుందని నిపుణులు అంటున్నారు. 2013 జులై 10వ తేదీన లిలీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు.
నేరం రుజువై, కనిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష పడితే ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు కోల్పోతారని సుప్రీంకోర్టు ఆ తీర్పులో స్పష్టం చేసింది. అది వెంటనే అమలులోకి వస్తుందని కూడా చెప్పింది. ఇది గతంలోని పరిస్థితికి భిన్నమైంది. ఓ కోర్టు దోషిగా నిర్ధారించి, శిక్ష వేస్తే, పై కోర్టుల్లో తేల్చుకునే వరకు అతను లేదా ఆమె తన సీటును కోల్పోయే పరిస్థితి ఉండేది కాదు. ఈ తీర్పు ద్వారా కింది కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే ఆ సభ్యుడు లేదా సభ్యురాలు అనర్హులవుతారు.

మరో చిక్కు కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉంది. ఓ కోర్టు దోషిగా తేల్చిన తర్వాత మూడు నెలల పాటు ప్రజా ప్రతినిధి శిక్షను సస్పెండ్ చేస్తూ ఊరట కలిగించే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 (4)ను రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
రేవంత్ రెడ్డికి రెండేళ్ల కన్నా తక్కువ శిక్ష పడినా రేవంత్ రెడ్డి తన శాసనసభా సభ్యత్వాన్ని కోల్పోయే పరిస్థితే ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. అవినీతి చర్యలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల్లో సభ్యుడని కోర్టు లేదా ట్రిబ్యునల్ దోషిగా తేలిస్తే అతను ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 ప్రకారం అనర్హుడు అవుతాడు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కేసుల్లో వారు అనర్హులైన ఉదంతాలున్నాయి.












Click it and Unblock the Notifications