కేసీఆర్ ఎంతమంది పీకేలను తెచ్చుకున్నా పీకేదేమి లేదు! .. గెలిచేది లేదు ? : రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. టీఆర్ఎస్ పార్టీని బొందపెట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఆ భయంతోనే పొరుగు రాష్ట్రాల నుంచి వ్యూహకర్తలను అద్దెకు తెచ్చుకుంటున్నారని విమర్శించారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలను ఎంత మందిని తెచ్చుకున్నా ఇక్కడ పీకేదేమి లేదు. కేసీఆర్ గెలిచేది లేదు అంటూ మండిపడ్డారు.

ఏపీ కాంట్రాక్టర్లతో కేసీఆర్ కుమ్మక్కు
ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలను మేధావులు ఆలోచించాలని రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ కోసం అనేక మంది అమరులైయ్యారని పేర్కొన్నారు. ఏపీ కాంట్రాక్టర్లతో కేసీఆర్ కుమ్మక్కై వేలకోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. కుల్వకుంట కుటుంబం ఆక్రమాలను ప్రజలకు తెలుసన్నారు. అధికారం కోసం కేసీఆర్ ఎంతకైనా దిగజారుతారని దుయ్యబట్టారు. నిరుద్యోగుల ఉసురుకు తప్పక కేసీఆర్‌కు తగులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో వారికే పథకాలు, ఉద్యోగాలు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీలలో చేరిన వారికే ఇస్తామని కీలక వ్యాఖ్యల చేశారు. పార్టీ సభ్యత్వంలో పనితీరును బట్టే వచ్చే తమ ప్రభుత్వంలో పదవులు ఇస్తామని చెప్పారు. దీనికి తానే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ఇందిరమ్మ ఇళ్లు, సోనియా రాజ్యంలో సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు.

పనిచేయని వారికి పదవులు కట్
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 38 లక్షల 40 వేల సభ్యత్వాలు నమోదయ్యాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి బూతులో కనీసం 100 సభ్యత్వం చేయని నేతల పదవులను రద్దు చేస్తామని హెచ్చరించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో తొలుత అమలు చేస్తామని చెప్పారు. పనిచేయని వారిని పదవులు తీసేస్తామని హెచ్చరించారు. గ్రామ స్థాయి నంచి కష్టపడిని వాళ్లకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications