హరీష్-ఈటల ఇద్దరూ తోడు దొంగలే : ఓ కసబ్ టీఆర్ఎస్ లో చేరాడు - హుజూరాబాద్ లో రేవంత్ రెడ్డి..!!
హుజురాబాద్ లో నామినేషన్ల పర్వం ముగిసింది. బీజేపీ అభ్యర్ధి ఈటల..కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నామినేషన్ వేసారు. ఆ సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. హుజురాబాద్ టీఆర్‌ఎస్ నాయకుడు కౌశిక్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి పరోక్షంగా మండిపడ్డారు. టీఆర్ఎస్‌లోకి పోతే పదవి వస్తుందని అనుకున్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పదవీ రాలే.. పైసలు కూడా రాలేదని రేవంత్‌రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. హరీష్‌రావు, ఈటల ఇద్దరూ తోడు దొంగలేనని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఏ ఆకాంక్ష కోసం తెలంగాణ తెచ్చుకున్నామో.. ఆ యువత ఆకాంక్షల సాధన కోసమే విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ నిర్వహించామని చెప్పారు. ఈ ఆలోచనలో భాగంగా యువకుడైన వెంకట్ ను బరిలోకి దించామన్నారు. మమ అనిపించడానికి తీసుకున్న నిర్ణయం కాదని.. ఈ ఎన్నికను ఆషామాషీగా తీసుకోవడం లేదని వివరించారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు మూటలు, ముల్లెలు సందు సందున సారా సీసాలు పంచుతోందని ఆరోపించారు. ఐదు నెలలుగా కాంగ్రెస్ ఎందుకు అభ్యర్థిని పెట్టలేదని అందరూ అనుకుని ఉంటారని..మా పోటీ ప్రజా సమస్యలపై మాత్రమేనని చెప్పారు.

అక్రమ సంపాదన కాంగ్రెస్ నాయకుల దగ్గర లేదని..మేము భూములు ఆక్రమించుకుని ఎక్కడా అమ్ముకోలేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ప్రజలకు నచ్చిన నాయకునికి టికెట్ ఇవ్వాలని భావిస్తోందని చెప్పారు. ఆనాడు మహామహ ఉద్దండులు కరీంనగర్ నుంచి ఉన్నా.. విద్యార్థి నాయకునిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కు ఎంపీగా టికెట్ ఇస్తే గెలిపించారని గుర్తు చేసారు. పొన్నంపై నిలబడిన అతీరథ మహారథులు ప్రజలు బండకేసి కొట్టి ఓడించారని వ్యాఖ్యానించారు. సుష్మా స్వరాజ్ కాళ్లకు దండకు పెట్టి తెలంగాణకు సపోర్టు చేయమని పొన్నం ప్రభాకర్ వేడుకున్నారని చెప్పారు.
2021లో కూడా ఇప్పుడు అదే సంప్రదాయంతో మళ్లీ బల్మూరి వెంకట్ ను పోటీ చేయిస్తున్నామన్నారు. హుజురాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని... విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేస్తామని రేవంత్ చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ దొంగలు ఎక్కడ చూసినా దోపిడికిపాల్పడుతున్నారని ఆరోపించారు. పొద్దునొకడు, సాయంత్రం ఒకడు లీడర్లను కొంటున్నారు. కొన్నోడినే మళ్లీ మళ్లీ కొంటున్నారన్నారు. కాంగ్రెస్ నుంచి ఓ కసబ్ ఇటీవలే టీఆర్ఎస్ లో చేరాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ నమ్మి టికెట్ ఇస్తే.. కార్యకర్తల గుండెల మీద తన్ని అమ్ముడుపోయాడని వ్యాఖ్యానించారు.
ఆ పేరు తలవడానికి కూడా తనకు ఇష్టం లేదన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత కొడుకులాగా నమ్మి బెడ్ రూంలో పెట్టుకుంటే .. ఆయననే మోసం చేసాడంటూ ఫైర్ అయ్యారు. పదవి ఆశ చూపితే పోయినోడికి.. పదవి రాకుండా గవర్నర్ ఆపేసారన్నారు. మోడీకి, కేడీకి బుద్ధి చెప్పాలంటే బల్మూరి వెంకట్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. హుజురాబాద్ లో విద్యార్థులు, యువకులు కలిపి 60 వేల మంది ఉన్నారు. మీ ఓటు మీరు వేసుకుంటే మీ ఎమ్మెల్యేగా వస్తాడని రేవంత్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications