రైతులు కన్నీళ్ళలో ఉంటే.. అయ్య ఔరంగాబాద్‌లో, కొడుకు ప్లీనరీలో ఊరేగుతున్నారు: రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలతో రైతాంగం అతలాకుతలమవుతోంది. అకాల వర్షాలతో కల్లాలలో ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విపరీతమైన ఈదురుగాలులతో కూడిన వర్షాల కారణంగా మిర్చి పంట నేలరాలింది. మొక్కజొన్న పంటకు అపార నష్టం జరిగింది. ఎక్కడికక్కడ ఉద్యాన పంటలు సైతం దెబ్బతిన్నాయి. ఇక ఈ పరిస్థితుల్లో అన్నదాతలు తమను ఆదుకునే వారి కోసం ఎదురుచూస్తున్నారు. చేతికి వచ్చిన పంట వర్షార్పణం కావడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం అన్నదాతల సమస్యలను పట్టించుకోవడం లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ట్విట్టర్ వేదికగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై, మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడిన రేవంత్ రెడ్డి అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం తడిసి రైతులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే... అయ్య ఔరంగాబాద్ లో, కొడుకు ప్లీనరీ ల పేరుతో, రాజకీయ సభలు పెట్టుకుని ఊరేగుతున్నారని మండిపడ్డారు.

తెలంగాణ రైతాంగం పట్ల కెసిఆర్ కు, కేటీఆర్ కు ఏమాత్రం కనికరం లేదన్నారు. కల్లాల దగ్గర రైతులు చేతికొచ్చిన పంట నీళ్ల పాలైందని గుండెలు బాదుకుని రోదిస్తుంటే అవేమీ పట్టనట్టు కెసిఆర్, కేటీఆర్ ప్రవర్తిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వీళ్లకు మానవత్వం ఉందా... బాధ్యత ఉందా... ఇది ప్రభుత్వమేనా...? అంటూ తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు, యువత ఏకమై బీఆర్ఎస్ ను బొందపెట్టే సమయం వస్తుందని రేవంత్ రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. ఒకపక్క ఉద్యోగాల విషయంలో యువతను మోసం చేశారని, మరోపక్క రైతులను అడుగడుగునా మోసం చేస్తున్నారని, వారంతా కచ్చితంగా బిఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెబుతారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications