తెలంగాణ ఆడబిడ్డల్ని.. బతుకమ్మ-బోనాలకే పరిమితం చేశారు! : రేవంత్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో వస్తే మహిళలకు రాజకీయ భాగస్వామ్యం ఉంటుందన్నారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం 'తెలంగాణ ఆడబిడ్డలను బోనాలు, బతుకమ్మలకే పరిమితం చేసిందని' దుయ్యబట్టారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ మహిళలకు రాజకీయ భాగస్వామ్యం లేకుండా పోయిందన్న రేవంత్.. ఎన్టీఆర్ హయాంలో ఆడబిడ్డలకు రాజకీయ స్వాతంత్ర్యం ఇచ్చారని, అలాగే ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు కూడా మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించారని చెప్పారు రేవంత్.

నాయకుడికి ఉండాల్సింది కులం కాదని మంచి గుణం ఉండాలని ఈ సందర్బంగా రేవంత్ సూచించారు. శనివారం నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన తెలుగు మహిళా కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్.. ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం మాట్లాడిన పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీనియర్ నేతలు మోత్కుపల్లి, రావుల కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ.. రాబోయే కాలంలో టీడీపీ అధికారంలోకి వస్తే.. మంత్రివర్గంలో ఆరుగురు మహిళలకు చోటు కల్పిస్తామని చెప్పారు. ఇక తెలంగాణలో 'ఎన్టీఆర్ రాజ్యం' రావాలన్న రమణ.. 60 ఏళ్లు పైబడ్డ మహిళలందరికీ రూ.2వేల పెన్షన్ తో పాటు డ్వాక్రా రుణాలను ఒకే దఫా మాఫీ చేసేలా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.












Click it and Unblock the Notifications