రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం.. ఎల్బీ స్టేడియంలో వెల్లువెత్తుతున్న జనసందోహం!!
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి పండుగలా జనం వచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకొని నేడు పాలనా పగ్గాలు చేపడుతున్న క్రమంలో, సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి, ఎల్బీ స్టేడియంలో జరగనున్న మహోత్సవానికి సామాన్య ప్రజలు పోటెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు మరో 11 మందిమంత్రులుగా నేడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు, ఆ పార్టీకి చెందిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరయ్యారు . సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హైదరాబాద్ కు చేరుకోగా రేవంత్ రెడ్డి స్వయంగా వారికి ఆహ్వానం పలికారు. ఇక ఎల్బీ స్టేడియం వద్ద హడావిడి చూసుకుంటే ఎల్బీ స్టేడియం వద్ద ఎటువంటి పాస్ లేకుండానే సామాన్యులను అనుమతిస్తున్నారు.

గేట్ నెంబర్ 6 ద్వారా లోపలికి అభిమానులు, ప్రజలు తరలి వెళ్తున్నారు. ఎలాంటి జన సమీకరణ చేయకుండానే ఎల్బీనగర్ స్టేడియం దగ్గర పెద్ద ఎత్తున జనం తరలివస్తున్న పరిస్థితి, రేవంత్ రెడ్డి పాలనను ప్రజలు ఆహ్వానిస్తున్నారు అని చెప్పడానికి అద్దం పడుతుంది. రెట్టించిన ఉత్సాహంతో ఎల్బీ స్టేడియంకు జనాలు తరలుతున్నారు. ప్రజలందరికీ ఇందిరమ్మ రాజ్యం నెలకొల్పే సమయం ఆసన్నమైందన్నారు రేవంత్ రెడ్డి.
ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అని రేవంత్ రెడ్డి పిలుపునివ్వటంతో భారీగా ప్రజలు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ఎల్బీ స్టేడియం ప్రాంగణం అంతా జన సందోహంతో కనిపిస్తుంది. సీఎం ప్రామాణ స్వీకార కార్యక్రమానికి వస్తున్న వారితో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణుల ఆనందోత్సాహాలు నేడు ఎల్బీ స్టేడియంలో కనిపిస్తున్నాయి. తెలంగాణా రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చెయ్యటం, కాగ్రెస్ ప్రభుత్వ పాలన రావటం నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలకు పండుగ రోజు. ఆ పండుగ వాతావరణమే నేడు ఎల్బీ స్టేడియంలో కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications