కెవిపి చేతిలో టీఆర్ఎస్: రేవంత్ బాంబు, హరీష్-కెటిఆర్ కమీషన్ల కొట్లాటతో కెసిఆర్‌కు జ్వరం
మహబూబ్ నగర్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు సీఎం కెసిఆర్, మంత్రులు హరీష్ రావు, కెటిఆర్‌ల పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లి వచ్చాక మరోసారి వారి పైన ఆయన దుమ్మెత్తి పోశారు.
వైయస్ రాజశేఖర రెడ్డికి ఓ ఆత్మ ఉండేదని, ఇప్పుడు అదే ఆత్మ కెసిఆర్‌ను ఆవహించి తెలంగాణ సర్కారును నడిపిస్తోందని.. కెవిపి రామచంద్ర రావు పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కెవిపి కనుసన్నుల్లో నడుస్తోందని మండిపడ్డారు.
ప్రభుత్వమే బందుకు పిలుపునివ్వడం విడ్డూరమన్నారు. కాంట్రాక్టర్ల నుండి కమిషన్ల కొట్టేసేందుకు కెసిఆర్ ప్రభుత్వం తెరలేపిందన్నారు. పాలమూరు బందుకు ప్రభుత్వం పిలుపునివ్వడం వెనుకు.. కెసిఆర్, హరీష్ రావుల ఉద్దేశ్యమేమిటని ప్రశ్నించారు.
కెసిఆర్ బినామీకంపెనీకు కట్టబెట్టేందుకే టెండర్లు పిలుస్తున్నారని ఆరోపించారు. పాలమూరు జిల్లాను దత్తత తీసుకొని ఏం చేశారని సిద్దిపేట నుండి వచ్చిన వ్యక్తి (కెసిఆర్, హరీష్ రావు), కొల్లాపూర్ వ్యక్తి (జూపల్లి)లు ప్రశ్నించారని కానీ, ఆయన ఏం చేశారో రికార్డులు పరిశీలిస్తే తెలుస్తుందన్నారు.

నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులను ఎవరు ప్రారంభించారో చెప్పాలన్నారు. జూరాలను ఎవరు పూర్తి చేశారన్నారు. వైయస్ హయాంలో కమిషన్ల కోసం ప్రాజెక్టులను మాయం చేశారన్నారు. ప్రాజెక్టుల్లోని అవినీతిపై నాగం జనార్ధన్ రెడ్డి నాడు పోరాడారని చెప్పారు.
ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా బందుకు పిలుపునివ్వడం విడ్డూరమన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు చంద్రబాబు వ్యతిరేకమని, కేంద్రానికి లేఖ రాశారని తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరమన్నారు. చంద్రబాబు సీడబ్ల్యూసీకి లేఖ రాసింది నిజమేనని, కానీ పాలమూరు, నక్కల గండి గురించి రాయలేదన్నారు.
ప్రాజెక్టు పైన డిపిఆర్ ఇవ్వాలని మాత్రమే లేఖలో కోరారని చెప్పారు. విభజన చట్టం ప్రకారం డిపిఆర్‌ను ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకోవాలన్నారు. ప్రతిపక్షాలను కుట్రతో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
కమిషన్ల అంతర్గత కుమ్ములాటలు, అందుకే కెసిఆర్‌కు జ్వరం
హరీష్ రావు, కెటిఆర్‌ల మధ్య కమీషన్ల కోసం అంతర్గతంగా కుమ్ములాటలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. కుటుంబంలోని తగాదాలతో వేగలేక కెసిఆర్ పదేపదే ఫాంహౌస్‌కు వెళ్లి పడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఆయనకు జ్వరం ఎందుకొస్తుందని ప్రశ్నించారు. ఫాం హౌస్‌లో ఏమైనా కష్టపడుతున్నాడా అన్నారు. అల్లుడు, కొడుకు మధ్య కమిషన్ల పంచాయతీ తీర్చలేక ఆయనకు జ్వరం పట్టుకుంటుందన్నారు. తెలంగాణ వద్దని రాజ్యసభలో నినదించిన కెవిపితో దోస్తీ చేస్తారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications