ఇంకా ఉద్యమాలా: రేవంత్ రెడ్డి విచారం, అలిగితే ఇవ్వాలా: కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యమాలు కొనసాగుతున్నాయని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి సోమవారం నాడు అన్నారు. ఇందిరాపార్క్ వద్ద ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి ఒక్కరోజు దీక్షకు రేవంత్ సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించకుండా సీఎం కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు పాలన సాగిస్తున్నారన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన నిరంజన్ రెడ్డి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారన్నారు.

అలిగారని ఇస్తారా: కిషన్ రెడ్డి
తెలంగాణలో ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి అన్నారు. రుణమాఫీ మూడో విడత నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. విభజన సమయంలో మిగులు బడ్జెట్ ఉండగా ఇప్పుడు బకాయిల తెలంగాణగా మార్చారన్నారు.
మిగులు బడ్జెట్ నుంచి దివాలా బడ్జెట్‌గా మారిందన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో 30 శాతం కూడా మంజూరు కాలేదన్నారు. అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడంలేదన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు.
కేంద్రం ఎంతో సాయం చేస్తున్నా, తెరాస నేతలు వాటిని కప్పి పుచ్చుతున్నారన్నారు. కేంద్ర నిధుల పైన కేసీఆర్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగాలే కాని ఎవరో అడిగారని, అలిగారని జిల్లాల సంఖ్యను పెంచొద్దన్నారు.












Click it and Unblock the Notifications