ఉచ్చు బిగిస్తోందా: 5రోజుల్లో కీలక పరిణామాలు, ఫైనాన్షియర్‌తో రేవంత్?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓ ఫైనాన్షియర్‌తో ఫోన్లో మాట్లాడేవాడని ఏసీబీ చెప్పిందని వార్తలు వస్తున్నాయి. కాల్ లిస్ట్ ఆధారంగా చెప్పిందని చెబుతున్నారు. ఆ ఫైనాన్షియర్ కృష్ణా జిల్లాకు చెందిన వారు కావొచ్చని భావిస్తున్నారట. అతనిని కూడా ప్రశ్నించొచ్చని తెలుస్తోంది.
ఓటుకు నోటు కేసులో ఏసీబీ దూకుడు సాగిస్తోంది. కేసులో కీలకమైన ఫోరెన్సిక్ నివేదిక కోర్టుకు చేరడంతో తదుపరి చర్యలకు సన్నాహాలు ప్రారంభించింది. ఫోరెన్సిక్ నివేదిక కోసం గురువారం కోర్టులో మెమో దాఖలు చేసింది. నివేదిక ఆధారంగా నోటీసుల జారీ, అరెస్టులతో దూకుడు పెంచనున్నట్టు తెలుస్తోంది.
రానున్న ఐదు రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయని ఓ అధికారి వెల్లడించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మీద ప్రస్తుతం ఏసీబీ దృష్టి పెట్టిందని సమాచారం. ఆయన అడిగిన గడువు పూర్తి కావస్తున్నది.

ఆ తర్వాత ఆయన ఏసీబీ ముందుకు రాకుంటే అరెస్టు చేయాలని అధికారులు భావిస్తున్నారట. అలాగే కేసులో ప్రధాన లబ్ధిదారు వేం నరేందర్ రెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
సండ్రకు ఏసీబీ 16న నోటీసు ఇచ్చింది. 19 వరకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఆయన పది రోజులు గడువు కోరారు. ఈ నెల 29వ తేదీ వరకు ఆగి, ఆ తర్వాత ముందుకు వెళ్లనుంది. సండ్రకు నేరుగా లేదా కోర్టు నుండి సమన్లు ఇప్పించి విచారించాలని ఏసీబీ భావిస్తోందని సమాచారం. అలా కాకుండా అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశ పెట్టే ఆలోచన కూడా చేస్తోంది.












Click it and Unblock the Notifications