తెలంగాణ: పొత్తుల దిశగా రేవంత్ రెడ్డి, షర్మిల??
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ముందస్తు ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ నేతలు మాత్రం మౌనంగా ఉంటున్నారు. తమ చర్యలద్వారా ముందస్తు ఎన్నికలు వస్తాయనే సంకేతాన్ని మాత్రం నాయకులు, ప్రజలకు పంపిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే చర్చలు పార్టీల్లో జోరుగా నడుస్తున్నాయి. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పాదయాత్ర చేసిన వైసీపీని నిలబెట్టిన షర్మిల
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గతంలో జైలుకెళ్లిన సమయంలో పాదయాత్ర చేసిన పార్టీని నిలబెట్టిన ఘనత వైఎస్ షర్మిలదే. తర్వాత ఆమె ఏపీ నుంచి తెలంగాణకు వచ్చారు. రైతు సమస్యల పరిష్కారం కోసం, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కోసం వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటి నుంచి కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న ఒక ప్రధాన సామాజికవర్గం తెలంగాణలో వైటీపీకి దగ్గరవుతున్న సూచనలు కనపడుతున్నాయి.

ఓట్లు చీలకుండా రేవంత్‌రెడ్డి వ్యూహం?
కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లలో ఎక్కువ మంది తెలంగాణలోనే ఉన్నారు. వైటీపీకి దగ్గరయ్యే సామాజిక వర్గమే కాంగ్రెస్‌లోను ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి ఈ వర్గాన్ని రేపటి ఎన్నికల్లో తమ తరుపుముక్కగా ఉపయోగించుకునే వ్యూహంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఉంది. బలమైన వర్గంగా ఉన్న వీరి ఓట్లు చీలిపోకుండా, టీఆర్ఎస్‌వైపు చూడకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒక వ్యూహాన్ని రచించారు. షర్మిల పార్టీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి, వైటీపీకి కూడా లాభమనే అంచనాలో ఆయన ఉన్నారు. ఈ ప్రతిపాదనపై ఆయన త్వరలోనే షర్మిలతో చర్చించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రేవంత్‌రెడ్డి ఆహ్వానాన్ని అంగీకరించిన షర్మిల
ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని భావిస్తున్న విశ్లేషకులు అందుకు ఒక ఉదాహరణను కూడా చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి రావాలని రేవంత్‌రెడ్డి షర్మిలను ఆహ్వానించారు. రాష్ట్రంలో దిగజారిపోతున్న శాంతి భద్రతలు, ఇతర అంశాలపై చర్చ జరుగుతుంది. ఈ భేటీకి టీఆర్ఎస్సేతర పార్టీలన్నింటి నుంచి నాయకులు హాజరవుతున్నారు. రేవంత్‌రెడ్డి ఆహ్వానాన్ని షర్మిల కూడా అంగీకరించారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేసే విషయం తెలిసిందే. బుధవారం పాదయాత్ర ప్రారంభించాల్సి ఉండగా ఆమె అఖిలపక్ష భేటీకి హాజరయ్యేందుకు వెళుతున్నారు.












Click it and Unblock the Notifications