మహాశివరాత్రి నాడు రక్తమోడిన రోడ్లు: ప్రమాదాలలో తండ్రీ కొడుకులు, బావా బామ్మరుదులు మృతి!!
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్న సందర్భంలో, ప్రజలంతా సంతోషంగా వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో, రెండు రోడ్డు ప్రమాద ఘటనలు నలుగురు ప్రాణం తీసి కుటుంబాలలో విషాదం నింపాయి. నిజామాబాద్ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో జరిగిన రెండు రోడ్డు ప్రమాద నెలలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం పండుగ పూట విషాదంగా మారింది.
నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోర్తాడ్ మండలం దొనకల్ గ్రామానికి చెందిన మారవీటి రవీందర్, మారవీటి శివరాజ్ బైక్ పై ఆర్మూర్ వైపు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.

పడగల్ గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో తండ్రి, కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న రవీందర్ ను కొడుకు ఆస్పత్రికి తీసుకు వెళుతున్న క్రమంలో వేగంగా బండిని నడుపుతున్న సమయంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే మహాశివరాత్రి పర్వదినాన సంగారెడ్డి జిల్లాలో కూడా దారుణ ఘటన చోటు చేసుకుంది. చౌటకూర్ మండలం శివంపేట బీర్ ఫ్యాక్టరీ వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు.
సంగారెడ్డి జిల్లా టేక్మాల్ మండలం మల్కాపూర్ తండాకు చెందిన లకావత్ శ్రీను, అల్లాదుర్గం మండలం ముప్పారం తండాకు చెందిన నేనావత్ అశోక్ లు బావా బావమరుదులు కూలి పని కోసం సంగారెడ్డికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications