కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు విడుదల
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్ల నిధులను బుధవారం విడుదల చేసింది.
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో మరో ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధమైంది. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్ల నిధులను బుధవారం విడుదల చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఆలయ అభివృద్ధికి నిధులను కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవ సభలో కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు మంజూరు చేస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే ఆగమశాస్త్రం ప్రకారం.. దేశంలోనే సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దనున్నారు.

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. సీఎం ప్రత్యేక చొరవతో కొండగట్టు దశ,దిశ మారనుందని ఆయన చెప్పారు. కాగా, కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఆలయాన్ని అద్భుతంగా మెరుగులు దిద్దనున్నారు.
కాగా, ఇటీవల ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన ప్రచార రథం వారాహికి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్దనే పూజలు చేయించారు. కొండగట్టు ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. తనకు కొండగట్టు అంజన్న అంటే ఎంతో నమ్మకం ఉందని చెప్పారు. తనకు ఓ ప్రాణ గండం నుంచి కొండగట్టు అంజన్నే కాపాడారని తెలిపారు పవన్ కళ్యాణ్.












Click it and Unblock the Notifications