దసరాకు ముందు వారి ఖాతాల్లో రూ.12.66కోట్లు.. పండుగ చేసుకున్నాక ట్విస్ట్!
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం ద్వారా ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటిని అందించడానికి ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 3,500 మందికి తొలి విడతలో ఇళ్ళను మంజూరు చేసింది. చాలా నియోజకవర్గాలలో దాదాపు ఇళ్ళ నిర్మాణం పూర్తి కావస్తోంది.
ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారుల ఖాతాలలో పొరబాటున 12.66 కోట్ల జమ
ఇప్పటికే కొంతమంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేయగా, త్వరలో భారీ సంఖ్యలో గృహ నిర్మాణాలకు లబ్ధిదారులు రెడీ అవుతున్నారు. అయితే
దసరా పండుగకు ముందు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ దశలు పూర్తి చేసుకున్న వారికి డబ్బులు జమ చేసే క్రమంలో అధికారులు పొరపాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1266మంది ఖాతాలలో మొత్తం 12.66 కోట్లకు పైగా డబ్బులను అదనంగా జమ చేశారు.

1266 మంది ఖాతాలలో జమ చేసిన డబ్బులను రికవరీ చేస్తున్న అధికారులు
సాంకేతిక కారణాల వల్ల ఈ నగదు లబ్ధిదారుల ఖాతాలలో జమ అయిందని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. మొత్తం 1266 మంది ఖాతాలలో జమ చేసిన డబ్బులను రికవరీ చేయాలని గృహ నిర్మాణ శాఖ పీడీ లకు జిల్లాల వారీగా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క లబ్ధిదారుని ఖాతాలో అదనంగా లక్ష రూపాయలు జమ కావడంతో, పండుగకు ముందు ఎక్కువ డబ్బులు ఖాతాలో జమ అయ్యిందని లబ్ధిదారులు పండుగ చేసుకున్నారు.
పొరబాటున జమ అయిన నగదు రికవరీకి తిప్పలు
కొంతమంది ఖాతాలో డబ్బులు పడిన వెంటనే విత్ డ్రా చేసి వారి అవసరాలకు వాడేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 157మంది, రంగారెడ్డి జిల్లాలో 119మంది, నిజామాబాద్ జిల్లాలో 91మంది ఇలా అనేక జిల్లాలలో లబ్ధిదారుల ఖాతాలలో పొరపాటున జమ అయిన నగదు తిరిగి రికవరీ చేసేపనిలో పడ్డారు అధికారులు. కొంతమంది నుండి ఇప్పటికే డబ్బులు రికవరీ చేయగా మరికొంతమంది నుండి డబ్బులు రికవరీ చేయడానికి అధికారులు నానా చావు చస్తున్నారు.
తిరిగి డబ్బులు ఇవ్వటానికి లబ్దిదారుల ఇబ్బంది
ఖాతాలలో జమ అయిన డబ్బులు మళ్ళీ తిరిగి రికవరీ చేస్తుండడంతో లబ్ధిదారులు తిరిగి డబ్బులు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇక బ్యాంకర్లకు కూడా లేఖలు రాసిన గృహ నిర్మాణ శాఖ అధికారులు ఖాతాదారుల నుండి డబ్బుల రికవరీకి బ్యాంకర్ల వైపు నుండి సహకారం కావాలని కోరారు. ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాలలో 100 కోట్ల వరకు నగదును జమ చేసిన ప్రభుత్వం, తాజాగా పొరపాటుగా చేసిన 12 కోట్ల 66 లక్షల రూపాయల నగదును తిరిగి రాబట్టడానికి తిప్పలు పడుతోంది.












Click it and Unblock the Notifications