హుజూరాబాద్ దళితబంధు కోసం రూ. 500 కోట్లు విడుదల: లక్ష కోట్లు ఖర్చు చేస్తామన్న హరీశ్ రావు
హైదరాబాద్: ఇప్పటికే తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామ దళితుల కుటుంబాల ఖాతాల్లో రూ. 10 లక్షలు జమ చేసిన కేసీఆర్ సర్కారు మరో కీలక ముందడుగు వేసింది. తాజాగా, త్వరలో ఉపఎన్నికలు జరగనున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు.

హుజూరాబాద్ దళితబంధు కోసం రూ. 500 కోట్లు విడుదల
హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం రూ. 500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు ఈ మొత్తాన్ని బదిలీ చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ దళితబంధు పథకం అమలుకానుంది. త్వరలోనే ఈ నిధులను దళిత కుటుంబాల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. ఆగస్టు 16వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ వేదికగా ప్రారంబించనున్నారు. దీనికి సంబంధించి మంత్రులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి దళితుల కోసం ఈ పథకం కింద రూ. 7.60 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.

దళితుల కోసం లక్ష కోట్లు ఖర్చు చేస్తామన్న హరీశ్
వచ్చే సంవత్సరం దళిత బంధు కింద బడ్జెట్‌లో రూ.30 వేల కోట్లు కేటాయించాలని ఆర్ధిక శాఖను ఆదేశించామని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. దళితులందరూ ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. రైతు బంధు మాదిరే దళిత బంధు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇతర పథకాలను అమలు చేసిన స్ఫూర్తితో దళిత బంధును అమలు చేసి తీరుతామని హరీష్ రావు స్పష్టం చేశారు. సోమవారం అంబేద్కర్ కమ్యూనిటీ భవనానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ భవన నిర్మాణానికి రూ. 50 లక్షలను మంజూరు చేశామన్నారు. మరో రూ. 75 లక్షలు మంజూరు చేసి.. మొత్తంగా రూ. కోటి 25 లక్షలతో అన్ని హంగులతో భవనం నిర్మిస్తామని మంత్రి చెప్పారు. రెండున్నరేళ్లలో తెలంగాణలో దళితుల అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చేర్యాలలో రూ. కోటి 25 లక్షలతో అన్ని హంగులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనం నిర్మిస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు.

ఆదివాసీలకు అభ్యున్నతికీ అధిక ప్రాధాన్యతంటూ ఎర్రబెల్లి..
ఆదివాసీల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల ప్రజలతో పాటు, ఆదివాసీ, గిరిజనుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఆదివాసులకు అన్ని మౌలికవసతులు కల్పించడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయాల నిధులు ఖర్చు చేస్తుందని వెల్లడించారు.అటవీ హక్కుల చట్టం అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, అటవీ ఉత్పత్తులపై ఆధారపడ్డ అడవి బిడ్డలకు స్వావాలంబన ప్రసాదించే దిశగా అడుగులు వేస్తున్నదని చెప్పారు. గిరిజన విద్యాభివృద్ధి కోసం రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని మంత్రి చెప్పారు. మేడారం జాతరను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని, ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీకైన కుమ్రం భీం వర్ధంతిని అధికారికంగా ఘనంగా జరపడంతో పాటు జోడేఘాట్ అభివృద్దికి రూ.25 కోట్లు, నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం కోసం రూ. 7 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. కేస్లాపూర్‌లోని నాగోబా జాతర ఉత్సవాలకు ప్రతి ఏటా ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తుందన్నారు మంత్రి ఎర్రబెల్లి. ఇక మైదాన గిరిజనుల కోసం ప్రత్యేకించి ప్రతి తండానూ గ్రామ పంచాయతీగా గుర్తించి.. మా తండాలో మా రాజ్యం' అనే గిరిజన ప్రజల కలను సాకారం చేసిందని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.

దళితబంధు దేశంలో ఎక్కడ లేని పథకం..: బాల్క సుమన్
దళితబంధు పథకం దేశంలో ఎక్కడా లేదని, తెలంగాణ దళితబంధు పథకం ఒక విప్లవమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. దళితజాతిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. వరంగల్ అర్బన్ కమలాపూర్ మండలం మర్రిపల్లిలో జరిగిన దళిత ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దళితబంధును అడ్డుకునే పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశంలో 20 శాతానికిపైగా దళితులు ఉన్నారని, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందితేనే దేశం ముందుకు పోతుందన్నారు. వ్యవసాయంలో ఉన్న సమస్యలన్నింటినీ సీఎం కేసీఆర్ పరిష్కరించారని, విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ పథకం తీసుకొచ్చారని చెప్పారు.
గత పాలకులు దళితులను కేవలం ఓట్లు వేసే వ్యక్తులుగానే చూశారని బాల్క సుమన్ ఆరోపించారు. బీజేపీ సిద్ధాంతమే దళితులకు వ్యతిరేకమని ఆరోపించారు. అడుగడుగునా వివక్షకు గురిచేసి ఇప్పుడు ఓట్లకోసం వస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ గురంచి మాట్లాడేముందు ఆలోచించాలన్నారు. 1989లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కేసీఆర్ దళితుల గురించి లోచించారని పేర్కొన్నారు. 2003 ఉద్యమ సమయంలో దళిత మేధావులతో దళితవర్గాల అభివృద్ధిపై చర్చించారని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కడే ఎలా బయలుదేరిండో.. దళితుల బాగుకోసం ఇప్పుడూ ఒక్కడే బలదేరిండని చెప్పారు. దళితబంధు పథకం దేశంలో ఎక్కడా లేదని బాల్క సుమన్ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితబంధు పథకాన్ని అడ్డుకుంటున్న బీజేపీని ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. కాగా, దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరికీ వర్తింపజేయాలని, ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని బీజేపీ, కాంగ్రెస్, సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications