16 నుంచి ఆర్టీసీ సమ్మె: సిటీలో తిరగని బస్సులు
హైదరాబాద్: వేతనాల పెంపు కోరుతూ ఈయూ, టిఎంయూలు ఏప్రిల్ 16 నుంచి సమ్మె చేయనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యానికి గురువారం నోటీసు ఇచ్చాయి. వేతనాల పెంపుపై ఆర్టీసీ యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో 16 నుంచి సమ్మె బాట పట్టనున్నట్లు ఈయుూ, టిఎంయూ నేతలు చెప్పారు.
అంతకుముందు నగరంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. టీఎంయూ, ఈయూ సంఘాల ఆధ్వర్యంలో గురువారం బస్‌భవన్ ముట్టడికి యత్నించారు. గురువారం 11 గంటలకు సుందరయ్య పార్కు నుంచి బస్‌భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాగా, ఆర్టీసీ కార్మిక సంఘాల పిలుపుతో హైదరాబాద్‌లో బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి.

రాజేంద్రనగర్ డిపోలోనే దాదాపు 150 బస్సులు నిలిపివేశారు. రంగారెడ్డి, హైదరాబాద్‌లో పలు ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి. వేతన సవరణ డిమాండ్ల నేపథ్యంలో బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం బయటికి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రైవేటు వాహనదారులు సందడిలో సడేమియా అన్నట్లుగా ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications