హైదరాబాద్ - విజయవాడ ప్రయాణీకులకు ఆర్టీసీ పికప్ సదుపాయం..!!
ఆర్టీసీ ప్రయాణీకులకు సులభతర ప్రయాణం కోసం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే డిమాండ్ కు అనుగుణంగా ఛార్జీల్లో మార్పులు చేస్తోంది. కొత్తగా పలు రూట్లలో ఎలక్ట్రికల్ బస్సుల ను ప్రవేశ పెడుతోంది. అదే విధంగా ప్రయాణికుల కోసం ఆర్టీసీ పికప్ వ్యాన్ సదుపాయాన్ని తాజా గా అందుబాటులోకి తీసుకొచ్చింది. నిర్దేశిత మార్గాల్లో ప్రయాణం చేసే వారి కోసం ఆర్టీసీ వ్యాన్ ద్వారా పికప్ సౌకర్యం మొదలు పెట్టింది.
ఆర్టీసీ హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల కోసం కొత్తగా పికప్ సదుపాయం తీసుకొచ్చింది. నగరంలోని ఈసీఐఎల్-ఎల్బీనగర్ మధ్య ప్రాంతాల నుంచి విజయ వాడ, నార్కట్‌పల్లి - అద్దంకి మార్గాల్లో వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ పికప్ వ్యాన్ సదుపాయాన్ని
ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి పికప్ పాయింట్లను ఖరారు చేసారు. అక్కడ నుంచి ప్రయాణీకులను బస్సులకు చేర్చేందుకు వీలుగా ఈ సదుపాయం అందబాటులోకి తీసుకొచ్చారు.

నగరంలోని ఈసీఐఎల్ కాప్రా మున్సిపల్ కాంప్లెక్స్, మౌలాలి హెచ్‌బీకాలనీ, మల్లాపూర్ బస్టాప్, హెచ్‌ఎంటీనగర్, నాచారం బస్టాప్, ఉప్పల్ మెట్రో స్టేషన్, నాగోలు - సుప్రజ హాస్పిటల్, ఎల్బీనగర్ ఎల్‌పీటీ మార్కెట్ వద్ద పికప్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. సమీప ప్రాంతాల్లోని ప్రయాణీకుల కోసం ప్రత్యేకంగా వ్యాన్లను ఏర్పాటు చేసారు. వారిని అక్కడ నుంచి ఎల్బీ నగర్ కు తీసుకొస్తారు. అక్కడి నుంచి జల్లాలకు వెళ్లే బస్సుల్లో ఎక్కించేందుకు సహకరిస్తారని వివరించారు.
ముందుగా 12 బస్సు సర్వీసులకు మాత్రమే ఈ పికప్ వ్యాన్ సదుపాయం ఉందని సంస్థ అధికారులు వెల్లడించారు. ముందస్తుగా రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణీకులకు ఈ పికప్ వ్యాన్ సదుపాయం వర్తిస్తుంది. ఈ పికప్ వ్యాన్‌లో ఎల్బీనగర్ చేరుకునేలోపే వేర్వేరు డిపోల నుంచి ఏర్పాటు చేసిన సూపర్ లగ్జరీ, ఏసీ స్లీపర్, నాన్ ఏసీ, రాజధాని బస్సులు సిద్ధంగా ఉంటాయి. ఎవరైనా ప్రయాణీకులు సందేహాలు ఉంటే 040-69440000, 040-23450033 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications