రైతు భరోసా నిధులను ఎప్పుడు జమ చేస్తారో నిండు సభలో వెల్లడించిన మంత్రి తుమ్మల
Rythu Bharosa: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం- రైతు భరోసా అమలు దిశగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రైతు భరోసా నిధుల చెల్లింపుపై అసెంబ్లీ శీతాకాల సమావేశాల సాక్షిగా విస్పష్ట ప్రకటన చేసింది. అన్నదాతలకు శుభవార్త వినిపించింది.
ఈ ఉదయం సభ ఆరంభంలోనే రైతు భరోసా అంశం చర్చకు వచ్చింది. స్వల్ప కాలిక అంశం కింద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చను ప్రారంభించారు. సమాయభావం వల్ల ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. లక్షలాది మందికి సంబంధించిన అంశం కావడం వల్ల రైతు భరోసాపై చర్చ చేపట్టారు.

అర్హులైన రైతాంగానికి సంక్రాంతి పండుగ నాటికి రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి రైతుకు సంక్రాంతికి రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా అన్నారు.
సంక్రాంతి పండగ నాటికి దీనికి అవసరమైన విధి విధానాలను రూపొందిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రధానమంత్రి- కిసాన్ పథకం విధి విధానాలను కూడా సభ ముందుంచామని పేర్కొన్నారు. వీటన్నింటిపైనా చర్చించి, విలువైన సూచనలు ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర రైతాంగ సంక్షేమాలన్ని దృష్టిలో ఉంచుకుని రైతు భరోసా నిధుల విడుదలకు అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలను రూపొందించాల్స ఉందని మంత్రి పేర్కొన్నారు. రైతు భరోసా నిధులు సక్రమంగా వినియోగం అయ్యేలా, ఈ పథకాన్ని అన్ని విధాలుగా సమగ్రంగా అమలు చేసేలా సూచనలు చేయాలని సభను కోరారు.
సాగు చేయని భూములకు కూడా గత ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేసిందని తుమ్మల ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఫలితంగా నిధులు దుర్వినియోగం అయ్యాయని అన్నారు. నిజమైన, సాగు చేసిన భూములకు మాత్రమే ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications