సైదాబాద్ హత్యాచారం: మారువేషాల్లో నిందితుడు?-ఫోటోలు విడుదల-రంగంలోకి 500 మంది పోలీసులు
హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు పల్లంకొండ రాజు ఆచూకీ ఇంకా దొరకలేదు. అతను మారు వేషాల్లో తప్పించుకు తిరుగుతున్నాడేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నిందితుడికి సంబంధించి మరిన్ని ఫోటోలు విడుదల చేశారు. 'ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు నిందితుడు మారు వేషాలతో తిరిగే అవకాశం ఉన్నందునా... జట్టు,గడ్డం వంటి మార్పులతో నిందితుని పోలి ఉండే చిత్రాలను విడుదల చేస్తున్నాం.గమనించగలరు.' అని హైదరాబాద్ పోలీస్ ట్విట్టర్‌లో వెల్లడించారు.
రంగంలోకి 500 మంది పోలీసులు
మరోవైపు నిందితుడి కోసం గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు. దాదాపు 500 మంది పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. టాస్క్‌ఫోర్స్ ఎస్‌వోటీ పోలీసులు సైతం రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని అన్ని బస్టాండ్లు,రైల్వే స్టేషన్లు,లేబర్ అడ్డాలను జల్లెడ పడుతున్నారు. నిందితుడికి మద్యం,కల్లు తాగే అలవాటు ఉండటంతో మద్యం షాపులతో పాటు కల్లు దుకాణాల వద్ద కూడా నిఘా పెట్టారు.గత గురువారం(సెప్టెంబర్ 9) ఈ హత్యాచార ఘటన చోటు చేసుకోగా...మరుసటిరోజు నిందితుడు బాలాపూర్ ప్రాంతంలో సంచరించినట్లు సీసీటీవీ ఫుటేజీలో వెల్లడైంది.పక్కనే ఉన్న ఎల్బీనగర్ రోడ్లు,వీధుల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

వారం రోజులు గడిచినా...
హత్యాచార ఘటన జరిగి దాదాపు వారం రోజులు కావొస్తున్నా నిందితుడు పట్టుబడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిందితుడు రాజు ఆచూకీ తెలియజెప్పినవారికి రూ.10లక్షలు రివార్డుగా అందజేస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిందితుడు రాజు ఆనవాళ్లను సీపీ అంజనీకుమార్ విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ తెలిపినవారి వివరాలను చాలా గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. సుదీర్ఘ చర్చల అనంతరం తాము రివార్డు ప్రకటిస్తున్నామన్నారు. నిందితుడు రాజు వయస్సు సుమారు 30 ఏళ్లు ఉంటుందని... అలాగే ఎ్తతు... సుమారు 5.9 అడుగులు ఉంటాడని చెప్పారు. నిందితుడి చేతులపై మౌనిక అనే టాటూ కూడా ఉంటుందన్నారు. ఆచూకీ తెలిసిన వారు 9490616366 మరియు 9490616627 అనే ఫోన్ నంబర్ల కు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ సీపీ తెలిపారు.

ఎన్‌కౌంటర్...?
ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజు ఫోటోలు విస్తృతంగా షేర్ అవుతున్నాయి.వాట్సాప్,ఫేస్‌బుక్,ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా రాజు ఫోటో జనాల్లోకి వెళ్లింది. నిందితుడు ఎక్కడ కనిపించినా పట్టించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు.అయినప్పటికీ అతని ఆచూకీ తెలియకపోవడం విస్మయం కలిగిస్తోంది. రాజు ఆత్మహత్య చేసుకుని ఉంటాడా అన్న అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాల్సిందేనని చిన్నారి తల్లిదండ్రులు,ప్రజలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తామని మంత్రి మల్లారెడ్డి కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏ క్షణం నిందితుడు పట్టుబడినా ఎన్‌కౌంటర్ జరిగే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video

గత గురువారం జరిగిన ఘటన...
హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి గత గురువారం (సెప్టెంబర్ 9) హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే.స్థానికంగా ఉండే పల్లంకొండ రాజు (30) అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రయినా ఆచూకీ తెలియకపోవడంతో ఆ ప్రాంతంలో జులాయిగా తిరిగే రాజుపై అనుమానం వచ్చింది. నల్గొండ జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న రాజు చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడు పాపను ఏమైనా చేశాడేమోనన్న అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. సాయంత్రం వరకూ చిరు నవ్వులతో ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ ఓ దుర్మార్గుడి దాష్టికానికి బలైపోవడం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications