ఆటో, బస్సు డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ చూస్తున్నారా..? వెంటనే ఇలా చేయండి.. ప్రయాణికులకు సజ్జనార్ విజ్ఞప్తి
రోడ్డుపై ఎంతో జాగ్రత్తగా డ్రైవింగ్ చేసినా ఒక్కోసారి రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రమాదం జరిగేందుకు ఒక్క సెకన్ చాలు.. అందుకే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ఎక్కడికక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తుంటారు. వేగం కన్నా ప్రాణం మిన్నా అని చెబుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డ్రైవింగ్ చేస్తూ కూడా ఫోన్ లను చూడడం ఇప్పుడు చాలామందికి అలవాటుగా మారింది. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం చట్టరిత్యానేరం అని తెలిసినా కొందరు మాత్రం అలానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమ ప్రాణాలతోపాటు తోటి ప్రయాణికుల ప్రాణాలను కూడా రిస్క్ లో పెడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్ లో ఓ ఆటో డ్రైవర్ ఫోన్ లో వీడియోలు చూస్తూ డ్రైవింగ్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దీనిపై తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి చేశారు.

'రెండు కళ్లకు ఎదురుగా రెండు ఫోన్లు.. ఒకదాంట్లో గమ్యం చూపించే నేవిగేషన్ రూట్, మరోదాంట్లో నాన్‌స్టాప్ వినోదాన్ని పంచే సినిమా! ఇక చెవులకేమో బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా రంగురంగుల లైట్లు వెలిగే పెద్ద హెడ్ఫోన్లు! ఇది ఒక ఆటో డ్రైవర్ అధునాతన సెటప్. ఒక నెటిజన్ సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోను నాకు పంపించారు. చూడటానికి ఇది మల్టీ-స్క్రీన్ గేమింగ్ విన్యాసంలా అనిపించినా, వెనుక కూర్చున్న ప్రయాణికుల పాలిట మాత్రం ఇది నడుస్తున్న మృత్యుశకటం' అని సజ్జనార్ స్పష్టం చేశారు.
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దృష్టి క్షణకాలం రోడ్డుపై నుంచి పక్కకు మళ్లినా ఘోర ప్రమాదాలు ముంచుకొస్తాయి. అలాంటిది నేరుగా సినిమా చూస్తూ, చెవుల్లో హెడ్ఫోన్లు పెట్టుకుని వాహనం నడపడం కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదు.. క్షమించరాని నేరం. ఎంవీ యాక్ట్ ప్రకారం ఇది డేంజరస్ డ్రైవింగ్ కిందకు వస్తుంది. దీనికి భారీ జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దయ్యే అవకాశమూ ఉంది అని అన్నారు.
వినోదం కోసం ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టడం భావ్యం కాదు. ఆటోను థియేటర్‌గా మార్చి జీవితాలకు ది ఎండ్ కార్డు వేయొద్దని గుర్తుంచుకోవాలి. వాహనం ఏదైనా.. టూవీలర్, కారు, ఆటో, బస్, లారీ.. డ్రైవింగ్ సమయంలో మొబైల్, హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ వాడకం ప్రాణాంతకం. ఈ క్రమంలో ప్రయాణం ఆటో అయినా, కారు అయినా, బస్సు అయినా ప్రయాణికులు కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
డ్రైవర్ ఫోన్ చూస్తున్నా, చెవుల్లో హెడ్ఫోన్లు లేదా ఇయర్‌బడ్స్ పెట్టుకున్నా చూస్తూ మౌనంగా ఉండిపోకండి. అది ప్రాణాలకే ప్రమాదమని వెంటనే ప్రశ్నించండి, వారించండి. ఒకవేళ వారు వినకపోతే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డయల్ 112కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించండి. ప్రయాణంలో మీ నిర్లక్ష్యం మీ ప్రాణాలకే ముప్పు తెస్తుంది.. అదే సమయంలో మీ అప్రమత్తత మీతో పాటు ఎందరో అమాయకుల ప్రాణాలను కాపాడుతుందని గ్రహించాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications
