జనసేనలోకి వంగవీటి..! బెజవాడ మేయర్ సీటు-తిరుపతి మేయర్ అభ్యర్ధీ చేరిక..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన వేళ కూటమిలో భాగమైన జనసేన పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. ప్రస్తుతం టీడీపీలో ఉన్న విజయవాడ నేత వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti radha) ఇవాళ జనసేన పార్టీలో చేరారు. ఆయనతో పాటు తిరుపతి మేయర్ అభ్యర్ధి అవుతారని భావిస్తున్న ప్రణీత్ ప్రమోద్ కూడా పార్టీలో చేరారు. వీరిద్దరూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన కండువాలు కప్పుకున్నారు.
అనంతరం వంగవీటి రాధాకృష్ణ తన అనుచరులను పవన్ కళ్యాణ్ కు పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టి గా ముందుకు వెళదామని పవన్ కళ్యాణ్ ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు.
గతంలో తన తండ్రి వంగవీటి రంగా హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన వంగవీటి రాధ.. ఆ తర్వాత మాత్రం నిలకడగా రాజకీయాలు చేయలేకపోయారు. కాంగ్రస్ నుంచి పీఆర్పీ, టీడీపీ.. ఇప్పుడు జనసేనలో చేరారు. అయితే మధ్యలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు తీసుకునే అవకాశం ఉన్నా తీసుకోలేదు. అలాగే నామినేటెడ్ పదవులు కూడా తీసుకోకుండా ఉండిపోయారు. ఇప్పుడు కూటమి పార్టీలు ఆయనకు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఏదో ఒక కీలక పదవి ఇవ్వాల్సి ఉంది. దీంతో విజయవాడ మేయర్ అభ్యర్ధిగా జనసేన నుంచి కూటమి తరఫున ఆయన్ని నిలబెట్టాలని నిర్ణయించారు. దీంతో ఆయన ఇవాళ టీడీపీని వీడి జనసేనలో చేరారు.

అలాగే తిరుపతి నుంచి జనసేనలో చేరిన ప్రణీత్ ప్రమోద్ సైతం స్థానికంగా మేయర్ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఆయన్ను కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేర్చుకున్నారు. ఆయన్ను తిరుపతి మేయర్ అభ్యర్దిగా త్వరలో జనసేన ప్రకటించనుంది. వీరిద్దరూ ఎన్నికల వేళ జనసేనలో చేరి మేయర్ అభ్యర్ధులుగా టికెట్లు దక్కించుకోనుండటం విశేషం. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన మధ్య ఉన్న అవగాహన నేపథ్యంలో వీరిద్దరూ జనసేన నుంచి మేయర్ అభ్యర్ధులుగా రంగంలోకి దిగబోతున్నారు. దీంతో వీరిద్దరినీ గెలిపించే బాధ్యతను టీడీపీ, బీజేపీ తీసుకోబోతున్నాయి.













Click it and Unblock the Notifications
