సిటీజనులకు గుడ్‌న్యూస్: సింగిల్ జర్నీ ఛార్జీలను 50 శాతం తగ్గించిన ఎంఎంటీఎస్
హైదరాబాద్: నగర ప్రయాణికులకు రైల్వే శాఖ నుంచి శుభవార్త అందింది. ఎంఎంటీఎస్ సర్వీసుల ఫస్ట్ క్లాస్ సింగిల్ జర్నీ ఛార్జీలను 50శాతం మేరకు తగ్గిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తగ్గించిన ఛార్జీలు మే 5 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లలో ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సింగిల్ జర్నీ ఫస్ట్ క్లాస్ ఛార్జీలు తగ్గించినట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
కాగా, లాక్డౌన్ అనంతరం ఎంఎంటీఎస్ సర్వీసులను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల ప్రయాణికులకు ప్రయోజనం కలిగేలా సర్వీసుల సంఖ్యను క్రమంగా పెంచుతోంది. ప్రస్తుతం ఫలక్‌నుమా, సికింద్రాబాద్, హైదరాబాద్, బేగంపేట, లింగంపల్లి, తెల్లాపూర్, రామచంద్రాపురం మధ్య .. 29 రైల్వే స్టేషన్లను అనుసంధానం చేస్తూ 86 సర్వీసులను నడుపుతోంది.

పలు స్టేషన్లలో రద్దీ సమయాలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల అవసరాలు తీర్చేలా సర్వీసులు నడుపుతున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. జంట నగరాల్లోని శివారు ప్రాంతాల ప్రయాణికులకు వేగవంతమైన, చౌకైన రవాణా మార్గాలను అందిస్తున్నామన్నారు. ధరల తగ్గింపు వల్ల ప్రయాణికులకు మరింత ప్రయోజనం కలుగుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. కాగా, ఇటీవల ఆర్టీసీ ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో ఎంఎంటీఎస్ ఛార్జీలు తగ్గించడం ప్రయాణికులకు కొంత ఉపశమనం కలిగించే అంశంగా చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications