ఇదేమి మర్మమో మరి: ప్రజలకు దూరంగా పరిపాలన...!

Subscribe to Oneindia Telugu

ఖమ్మం: ప్రజల వద్దకు పాలన. అందరికీ అందుబాటులో ప్రభుత్వ కార్యాలయాలు...అనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ నినాదం, ఆకాంక్ష కూడా. ఆకాంక్ష మంచిదే. ఎవ్వరూ ఆక్షేపించరు. కాని ఆచరణ అందుకు విరుద్ధంగా ఉండటంతో ఖమ్మం జిల్లా ప్రజలు అసంతృప్తి చెందుతన్నారు. రాజకీయ పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. పది జిల్లాలను 31 జిల్లాలు చేసి ఏడాది నిండింది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల్లో కలెక్టర్‌ కార్యాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు (సమీకృత కలెక్టరేట్‌) ఒకే ప్రాంగణంలో నిర్మిస్తామని, ఇది ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ఇచ్చిన హామీని సర్కారు నెరవేర్చే ప్రయత్నాలు చేస్తోంది.

స్థలాలు సేకరించిన జిల్లాల్లో శంకుస్థాపనలు జరిగాయి. కొన్ని జిల్లాల్లో భూమి సేకరణ జరుగుతోంది. ఇలాంటి జిల్లాల్లో ఖమ్మం కూడా ఉంది. ప్రస్తుతం జిల్లా కేంద్రమైన ఖమ్మంలో నడిబొడ్డున, అందరికీ అనుకూలంగా, సౌకర్యంగా ఉన్న జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని నగరానికి దూరంగా తరలించబోతున్నారు. కార్పొరేషన్‌ పరిధిలోని వైరా రోడ్డులో ఉన్న వి.వెంకటాయాపాలెం వద్ద నిర్మించబోతున్నారు. విచిత్రమేమిటంటే నగరంలో కీలకమైన ఎన్నెస్పీ కెనాల్‌ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కాదని వెంకటాయపాలెంలో రైతుల భూములను సేకరించే పనిలో పడ్డారు అధికారులు.

Secret agenda behind the collector office

నగరంలో 13 ఎకరాలు ప్రభుత్వ భూమి సిద్ధంగా ఉన్నప్పటికీ దాన్ని తిరస్కరించడానికి అధికారులు చెబుతున్న కారణం హాస్యాస్పదంగా ఉంది. కలెక్టరేట్‌ కోసం రూపొందించిన డిజైన్‌కు ఆ భూమి అనువుగా లేదట...! ఇక్కడ ప్రభుత్వం రెండు తప్పులు చేస్తోంది. మొదటిది నగరం నడిబొడ్డున ఉన్న కలెక్టరేట్‌ను సుదూరంగా తరలించడం. రెండోది నగరంలో ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ ఊరికి దూరంగా ప్రయివేటు భూములు సేకరిస్తుండటం. వెంకటాయపాలెం బస్సుస్టాండుకు, రైల్వే స్టేషన్‌కు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లా నలు మూలల నుంచి రైళ్లలో, బస్సుల్లో వచ్చేవారు అక్కడ దిగి ఆటోలు మాట్లాడుకొని కలెక్టరేట్‌కు వెళ్లాల్సివుంటుంది.

కలెక్టర్‌ కార్యాలయంలో పనులున్నవారు అవి పూర్తి చేసుకున్న తరువాత ఊళ్లో షాపింగ్‌ చేసుకొని, ఇతరత్రా పనులు చూసుకొని వారి ఊళ్లకు వెళుతున్నారు. హోటళ్లు, ఆస్పత్రులు, అన్ని రకాల షాపులు అందుబాటులో ఉన్నాయి. కలెక్టరేట్‌ దూరమైతే ప్రజలకే కాదు ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకూ తిప్పలే. కల్టెక్టరేట్‌ను ఊరికి దూరంగా తరలించే ప్రయత్నాలు చేస్తుండటంతో రాజకీయ పార్టీలు ఆందోళనలకు దిగాయి. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు.

కలెక్టరేట్‌ కోసం నగరానికి దూరంగా స్థలాలు సేకరించడం వెనక పలువురు టీఆర్‌ఎస్‌ నేతల హస్తం ఉందనే ప్రచారం సాగుతోంది. ఆ ప్రాంతంలో వారి స్థలాలు ఉండటంతో వాటికి డిమాండ్‌ పెరగడం కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ స్థలాన్ని తిరస్కరింపచేశారని అంటున్నారు. మొత్తం మీద ప్రజలకు దగ్గరగా ఉన్న పరిపాలన దూరంగా వెళ్లే రోజులు రాబోతున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
No body knows what is the secret behind the Khammam district collecterate in Telangana.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి