జల్సాల కోసం చోరీలు: రహస్యంగా పెళ్లి, పట్టుబడిన దొంగలు
హైదరాబాద్: రహస్యంగా చేసుకున్న వివాహం ఇద్దరు దొంగలను పోలీసులకు ఫట్టిచ్చింది. ఇద్దరు యువకులు జల్సాలకు అలవాటు పడి హైదరాబాద్ నగరంలో మకాం వేసి చోరీలను మొదలెట్టారు. ఓ మహిళతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వీరిలో ఒకడు ఆమె బంధువుల అమ్మాయికి వలవేసి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి తల్లి కిడ్నాప్ కేసు పెట్టడంతో పోలీసులు దర్యాప్తులో ఇద్దరు దొంగల గుట్టురట్టు అయింది.
నిందితులను తుకారాంగేట్ పోలీసులు అరెస్ట్ చేసి 85.8 గ్రాముల బంగారు, 56 గ్రా ముల వెండి, ఒక ట్యాబ్, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ నార్త్‌జోన్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి గురువారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఖమ్మం జిల్లా కొత్తగూడెం దుర్గాటాకీస్ సఫాయిబస్తీకి చెందిన కొన ఉమామహేష్ (24) మాల్కాజిగిరి మీర్జాల్‌గూడలో, అర్జి నవీన్‌కుమార్ (28) బాలాజీనగర్ యాప్రాల్‌లో ఉంటున్నారు. వీరిద్దరూ జల్సాలకు అలవాటు పడి తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి రాత్రివేళల్లో చోరీలు చేస్తున్నారు.
కార్ఖానా, తుకారాంగేట్, బోయిన్‌పల్లి ఠాణాల పరిధుల్లో జరిగిన దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్నారు. లోగడ ఖమ్మం జిల్లా కొత్తగూడెం, నగరంలోని కార్ళానా, తిరుమలగిరి ప్రాంతాల్లో జరిగిన కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో పలు పోలీస్టేషన్లలో 6, హైదరాబాద్‌లో 3 నాన్‌బెయిల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి.

భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటున్న మీనా అనే యువతితో ఉమామహేష్‌కు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. మీనా ద్వారా ఆమె కుటుంబ సభ్యులతో ఉమా మహేష్‌కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో అతడు మీనా అక్క కూతురుకు వల వేశాడు. కొన్ని రోజుల క్రితం ఆమెను తీసుకెళ్లి ఓ రహస్య ప్రదేశంలో పెళ్లి చేసుకున్నాడు.
దీనిపై మీనా అక్క తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు దొంగతనాల కేసులు బయటపడ్డాయి. నిందితులిద్దరదినీ అరెస్ట్ చేసి వారి నుంచి సొత్తు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications