సీవీ ఆనంద్ సంచలనం: హైదరాబాద్‌లో..!!
Hyderabad: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. నెల రోజుల పాటు అంటే- నవంబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఇది అమలులో ఉండబోతోంది. అనంతరం అప్పటి పరిస్థితులను బట్టి దీన్ని ఎత్తివేయాలా? లేక కొనసాగించాలా? అనేది నిర్ణయిస్తారు.
హైదరాబాద్‌లో తరచూ వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు, బైఠాయింపులు, నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తూ వస్తోండటం వల్ల నగర ప్రజలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోన్నారని, శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయనే కారణంతో 144 సెక్షన్ విధించామని సీవీ ఆనంద్ వెల్లడించారు.

భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023లోని సెక్షన్ 163 ద్వారా తనకు సంక్రమించిన అధికారాల ఆదారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. సెక్షన్ 144 అమలులో ఉన్న ఈ నెల రోజుల పాటు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ఆందోళనలు, ధర్నాలకు అనుమతి ఉండదు.
బహిరంగ సభలు, ర్యాలీలను నిర్వహించడం నిషేధం. ఎలాంటి ప్లకార్డులు, జెండాలను ప్రదర్శించడానికీ పోలీసులు అనుమతి ఇవ్వరు. అయిదుగురు కంటే ఎక్కువ మంది ఒకేచోట గుమికూడి ఉండకూడదు. ధర్నాలను లోయర్ ట్యాంక్ బండ్, ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్ వద్ద మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లల్లో ఆందోళనలను నిర్వహించడానికి అనుమతి లేదు.
ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో తరచూ ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతూ వస్తోన్నందున నగర పోలీస్ కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇటీవలే గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగిన విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం అరెస్ట్ అయ్యారు.
తాజాగా రాష్ట్రంలో ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని, సెలవుల విధానంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ బెటాలియన్లల్లో పని చేస్తోన్న స్పెషల్ పోలీసులు ఆందోళనలకు దిగుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయం వద్ద బైఠాయించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సెక్షన్ 144ను విధించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications