రేవంత్ రెడ్డికి అదనపు భద్రత పెంచండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
పాదయాత్ర చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అదనపు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ కోర్టు ఆదేశించింది.
హైదరాబాద్: పాదయాత్ర చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అదనపు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ కోర్టు ఆదేశించింది. హాథ్ సే హథ్ జోడో యాత్ర చేపట్టిన రేవంత్ రెడ్డి తనకు అదనపు భద్రత కల్పించాలని కోరుతూ ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం మరోసారి విచారణ చేపట్టింది.
తగిన భద్రత లేకపోవడం వల్ల పాదయాత్రలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని, ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ముప్పు ఉందని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు 69 మందితో భద్రత కల్పిస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది వివరించారు. అయితే, ఆ భద్రత అంతా ట్రాఫిక్ నియంత్రణకే సరిపోతోందని రేవంత్ రెడ్డి న్యాయవాది తెలిపారు.

వాదనలు విన్న హైకోర్టు.. రేవంత్ రెడ్డికి భద్రత పెంచాలని స్పష్టం చేసింది. పాదయాత్రతోపాటు రేవంత్ రెడ్డి రాత్రి బస చేసే ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మేడారం సమక్క-సారలమ్మలను దర్శించుకుని రేవంత్ రెడ్డి తన పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేవంత్ పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి.. కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయనకు బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications