సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్‌ల ప్రారంభానికి ముహూర్తం ఖరారు
సీతారామ ప్రాజెక్ట్ కు చెందిన మూడు పంప్ హౌస్‌లు ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆగస్ట్ 15న ఆ మూడు పంప్ హౌస్‌లను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో బాగంగా ఈ ఆదివారం రోజున ట్రయిల్ రన్ మొదలు పెడుతున్నట్లు పేర్కొన్నారు.
సీతారామ ప్రాజెక్ట్ కు చెందిన మూడు పంప్ హౌస్‌ల ప్రారంభోత్సవ ఏర్పాట్లతో పాటు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులపై శనివారం మంత్రి ఉత్తమ్ సచివాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖా కార్యదర్శి రాహుల్ బొజ్జా, సహాయ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇఎన్సీ అనిల్ కుమార్, డిప్యూటి ఇఎన్సీ కే శ్రీనివాస్ తదితరులు ఈ సమీక్ష లో పాల్గొన్నారు. పంప్ హౌస్‌ల ప్రారంభోత్సవం రోజున ఖమ్మం జిల్లా వైరాలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కు గోదావరి జలాల నుంచి 67 టీఎంసీల కేటాయింపుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. సీతారామ లిఫ్ట్ ఐరిగేషన్ నిర్మాణపు పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ప్రతి ఎకరాకు నీరందించి సేద్యంలోకి తేవాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా నీటిపారుదల శాఖాధికారులు పనులను వేగవంతం చేయాలని ఆయన చెప్పారు.
ప్రాజెక్ట్ నిర్మాణపు అనుమతులు చివరి దశకు చేరడంతో పాటు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు చేరిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. అదే సమయంలో సుప్రీంకోర్టు తో పాటు కేంద్ర పర్యావరణం అటవీ శాఖాల అనుమతులపై దృష్టి సారించి సంబంధించిన అధికారులతో సంప్రదింపులు జరపాలని అధికారులకు ఆయన సూచించారు. కాలువల నిర్మాణంలో అడ్డుగా ఉన్న రైల్వే క్రాసింగ్ ల వద్ద నిర్మాణం ఆగి పోకుండా ఉండేలా ఆ శాఖతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు.
34.561,37.551 కిలోమీటర్ల వద్ద ఉన్న క్రాసింగ్ ల విషయమై మంత్రి ఉత్తమ్ ప్రస్తావిస్తూ రైల్వే శాఖతో చర్చించి ఆ శాఖా నిబంధనల మేరకు సత్వరం నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్యాకేజ్ 1,2లకు సరిపడా భూసేకరణను వెంటనే చేపట్టాలన్నారు. ఈ రెండు ప్యాకేజీలకు అవసరమయ్యే 3,000 ఎకరాల భూసేకరణ సత్వరమే చెప్పట్టగలిగేతే నిర్దేశిత లక్ష్యానికి సకాలంలో చెరుకోగలుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మొత్తం త్వరితగతిన పూర్తి అయితే 3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్తగా రెండు లక్షల 60 వేల ఎకరాల ఆయకట్టును సేద్యం లోకి వస్తున్నందున పనులు వేగం పెంచాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.












Click it and Unblock the Notifications