కొత్త డీజీపీ పేరు ఖరార్..!!
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం మహేందర్ రెడ్డి ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. 1986 బ్యాచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐపీఎస్ అధికారి ఆయన. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ కేడర్ కు వెళ్లారు. ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్, గుంటూరు, బెల్లంపల్లిల్లో అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ గా పనిచేశారు. అనంతరం నిజామాబాద్, కర్నూలు ఎస్పీగా అపాయింట్ అయ్యారు.

2017 నుంచి..
1995లో హైదరాబాద్ తూర్పు జోన్ డీసీపీగా, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీగా వ్యవహరించారు. అనంతరం ఇంటెలీజెన్స్ చీఫ్, గ్రేహౌండ్స్ ఐజీగా పలు జిల్లాల్లో వివిధ హోదాల్లో పని చేశారాయన. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా వ్యవహరించారు. 2017 నవంబర్ లో ఇన్‌చార్జ్ డీజీపీగా బాధ్యతలను స్వీకరించారు. 2018 ఏప్రిల్ లో పూర్తి స్థాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నియమితులయ్యారు.

అంజనీ కుమార్ కు ఛాన్స్
కాగా- ఇప్పుడు ఆయన స్థానంలో ఎవరు వస్తారనేది చర్చనీయాంశమౌతోంది. దీనికోసం మూడు పేర్లను తెలంగాణ ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. 1990 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అంజనీ కుమార్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, అవినీతి నిరోధక విభాగాధిపతిగా ఉంటోన్నారు. గతంలో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా పని చేసిన అనుభవం ఉంది. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగానూ సేవలను అందించారు.

రవి గుప్తా పేరు కూడా..
గతంలో మహేందర్ రెడ్డి రెండు వారాల పాటు మెడికల్ లీవ్‌లో ఉన్నప్పుడు అంజనీ కుమార్‌ను ఇన్‌ఛార్జ్ డీజీపీగా పని చేయడం ఆయనకు కలిసొచ్చే అంశమని చెబుతున్నారు. 1990 బ్యాచ్ కే చెందిన మరో సీనియర్ ఐపీఎస్ అధికారి రవి గుప్తా కూడా రేసులో ఉన్నారని సమాచారం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. ప్రస్తుతం తెలంగాణ హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తోన్నారు.

రేసులో ఉమేష్ షరాఫ్..
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తోన్న 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఉమేష్ షరాఫ్ పేరు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఉమేష్ షరాఫ్ మరో ఆరు నెలల్లో పదవీ విరమణ చేయాల్సి ఉన్నందున ఆయనకు గల అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు. వచ్చే సంవత్సరం మేలో ఆయన పదవీ విరమణ చేస్తారని తెలుస్తోంది.

అంజనీకుమార్ వైపే కేసీఆర్ మొగ్గు..
దీనికి సంబంధించిన ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉందని అంటున్నారు. అంజనీ కుమార్ వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారనే ప్రచారం ఉంది. మహేందర్ రెడ్డి పదవీ విరమణ తరువాత ఇన్ ఛార్జ్ డీజీపీగా అంజనీకుమార్ ను అపాయింట్ చేసి- కొద్ది రోజుల తరువాత ఆయనను పర్మినెంట్ చేయొచ్చనే వాదనలు కూడా వినిపిస్తోన్నాయి.












Click it and Unblock the Notifications