ఓటమి పాలైన బర్రెలక్క సంచలన ప్రకటన!!
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ప్రతినిధిగా ఎన్నికల బరిలోకి దిగి సెన్సేషన్ సృష్టించిన బర్రెలక్క నిన్న వెలువడిన ఫలితాలలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్కకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి విదేశాల నుండి కూడా బర్రెలక్కకు ప్రజల నుండి విశేషమైన మద్దతు లభించింది.
చదువుకుని కూడా ఉద్యోగం రాక బర్రెలు కాసుకుంటూ జీవనం సాగిస్తున్న బర్రెలక్క మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం నుండి పోటీ చేసి వీరోచితంగా పోరాడింది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు వణుకు పుట్టించింది. ప్రచారం చేయడానికి తన దగ్గర డబ్బులు కూడా లేవని చెప్పిన బర్రెలక్కకు చాలామంది తమ వంతుగా ఆర్థిక సహాయం అందించారు.

నీకు మేమున్నాం ముందుకు నడవమని ఆమెకు మద్దతును ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క 5754 ఓట్లు సాధించగలిగింది .ఇక తన ఓటమిపై మాట్లాడిన బర్రెలక్క తాను ఒక సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది . అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, మద్యానికి లొంగకుండా తనకు ఓట్లు వేసిన వారికి తాను ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొంది.
నమ్మి ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగానని స్వతంత్రంగా పోటీ చేసి 6000 ఓట్ల వరకు సాధించటం తన నైతిక విజయం అని వెల్లడించింది. అంతేకాదు 2024లో రానున్న ఎన్నికలలో పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతానని బర్రెలక్క సంచలన ప్రకటన చేసింది.
ఇక సోషల్ మీడియాలో ఎన్నికల సమయంలో రచ్చ చేసిన బర్రెలక్క ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలైంది. సోషల్ మీడియా క్రేజ్ ఆమెకు ఓటు బ్యాంకుగా మారలేదు. కొల్లాపూర్ ప్రజలు బర్రెలక్కను ఆదరించలేదు. ఇక మరోమారు ఏకంగా పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతానని చెప్తున్న బర్రెలక్కను ఓటర్లు ఆదరిస్తారా? ఈసారి బర్రెలక్క పోటీకి ఇంత క్రేజ్ ఉంటుందా? అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications