వరంగల్ లో వరుస షాక్ లతో బీఆర్ఎస్ విలవిల.. కాంగ్రెస్ గూటికి నేతల క్యూ!!
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వరుస షాక్ లతో విలవిలలాడుతోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం లో కీలక నేత అయిన మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ బాట పట్టారు.
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు కొండా సురేఖను గెలిపించడం కోసం నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలో పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పలువురు కీలక నాయకులు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక తాజాగా వరంగల్ తూర్పు నియోజకవర్గ కీలక నేత గుండా ప్రకాష్ రావు ఈరోజు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన గుండా ప్రకాష్ రావు, ఆ తరువాత తెలంగాణ ఉద్యమం సమయంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అనేక ముఖ్యమైన పదవులలో కూడా ఆయన కీలకంగా పనిచేశారు. వరంగల్ నగరపాలక సంస్థ మేయర్ గా పని చేశారు. పార్టీలో కీలక నేతగా సీనియర్ నేతగా పేరున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆయనకు సరైన గౌరవం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి.
పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ఏకపక్ష ధోరణితో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన తాజాగా పార్టీ మారనున్నట్టు తెలిపారు.ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, వరంగల్ తూర్పు నియోజకవర్గం లో జరిగే కార్నర్ మీటింగ్లో రాహుల్ గాంధీ సమక్షంలో గుండా ప్రకాష్ రావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
ప్రస్తుతం ఆయన అనుచరులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే తూర్పు నియోజకవర్గంలో కొండ సురేఖ, కొండా మురళి ఇస్తున్న వరుస షాక్ లతో బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తీవ్రమైన టెన్షన్ లో పడుతున్నారు. ఇక తాజా చేరికలు చూసిన వారంతా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు కష్టమేనని తేల్చి చెబుతున్నారు












Click it and Unblock the Notifications