ఏడేళ్ళకే పోలీస్ అయిన మోహన్ సాయి!!
మోహన్ సాయి.. వయసు ఏడేళ్లు.. కానీ అతి చిన్న వయసులోనే పోలీస్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టాడు. అంతేకాదు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ తో కలిసి ఒక కేసు గురించి సీరియస్ గా చర్చించాడు. ఇంతకీ మోహన్ సాయి ఎవరు? అతిపిన్న వయసులోనే అతను పోలీస్ ఎలా అయ్యాడు? అసలేం జరిగింది? తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన బ్రహ్మం, లక్ష్మీ దంపతుల కుమారుడు మోహన్ సాయి. ప్రస్తుతం ఇతను 4వ తరగతి చదువుతున్నాడు. అయితే మోహన్ సాయి చిరకాల కోరిక మాత్రం పోలీస్ కావడమే.. విధి ఆడిన వింత ఆటలో బాలుడు మోహన్ సాయి క్యాన్సర్ బారిన పడ్డాడు.

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఏడాదికాలంగా క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నాడు. ఏడాదిగా తల్లిదండ్రులు అక్కడే ఉండి కుమారుడికి చికిత్స చేయిస్తున్నారు. తనకు పోలీస్ కావాలని ఉందని పదే పదే చెబుతున్న కొడుకు కోరికను తీర్చడం కోసం తల్లిదండ్రులు మేక్ ఏ విష్ ఫౌండేషన్ వారిని కలిసారు.
మోహన్ సాయి పరిస్థితి చూసి చలించిన వారంతా అతని కోరిక తీర్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఆస్పత్రి సిబ్బంది ద్వారా బాలుడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు బంజారాహిల్స్ పోలీసులను కలిశారు. మోహన్ సాయి కోరికను తీర్చేందుకు పోలీసులు అంగీకరించడంతో శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు బుజ్జి పోలీస్ మోహన్ సాయి ని తీసుకువచ్చారు.

యూనిఫాంలో స్టేషన్లోకి అడుగుపెట్టిన మోహన్ సాయి కి డిటెక్ట్ ఇన్స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ సెల్యూట్ కొట్టి పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్లారు. బాలుడిని తన సీట్ల కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ పనితీరుపై ఆయనకు వివరించారు. ఈ విధంగా మోహన్ సాయి చిరకాల కోరిక తీర్చి పోలీసులు ఔదార్యాన్ని చాటుకున్నారు.












Click it and Unblock the Notifications