కామారెడ్డిలో కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్.. కేసీఆర్ పై పోటీకి 100నామినేషన్లు!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరుగుతోంది. ఇక ఇదే సమయంలో కామారెడ్డి నుండి సీఎం కేసీఆర్ ఎన్నికల బరిలోకి దిగుతున్న నేపథ్యంలో, సీఎం కేసీఆర్ కు కామారెడ్డి ప్రాంత రైతులు ఊహించని షాక్ ఇచ్చారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే తాము కెసిఆర్ పై పోటీకి వంద నామినేషన్లు దాఖలు చేస్తామని వెల్లడించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ లో నేడు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు. ఆయా గ్రామాల రైతుల నుంచి సలహాలు, సూచనలు సేకరించారు.

అనంతరం ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ తమ భూములు కాపాడుకునేందుకు తాము ఎంతవరకైనా వెళ్తామని ప్రకటించారు. రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వ్యవసాయ భూములు ఇండస్ట్రియల్ జోన్ వస్తున్నాయంటూ, కామారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతోనే తాము ఉద్యమం బాట పట్టామన్నారు. వెంటనే రైతులకు నష్టం కలిగించే మాస్టర్ ప్లాన్ ను రద్దు చెయ్యాలన్నారు.
మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అసలు కేసీఆర్ కు ఇక్కడేం పనంటూ వారు ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తరువాతే కేసీఆర్ కామారెడ్డికి రావాలని హెచ్చరించారు. లేని పక్షంలో ప్రతి గ్రామం నుంచి 15 మంది చొప్పున కేసీఆర్ పై 100 నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు.
గతంలో నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు కవితకు షాక్ ఇచ్చినట్టు కేసీఆర్ కు ఇస్తామని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో లింగాపూర్, టెక్రియాల్, పాత రాజంపేట, అడ్లుర్, రామేశ్వర పల్లి, అడ్డూర్ ఎల్లారెడ్డి, కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ బాధిత రైతు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ కు, తెలంగాణా ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications