మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్: ప్రచారంలో నిరసన సెగ; అసలేం జరిగిందంటే!!
మునుగోడు ఉప ఎన్నికల పర్వం పీక్స్ కు చేరుకుంది. ప్రచార పర్వంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని టిఆర్ఎస్ పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో రంగంలోకి దింపి, ప్రచారం నిర్వహిస్తోంది. ఇక మునుగోడులో కాషాయం జెండా ఎగురవేయాలని తాపత్రయపడుతున్న కమలనాథులు సైతం ఇంటింటి ప్రచారాన్ని చేపట్టి ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. మునుగోడులో ఆడబిడ్డను ఆశీర్వదించమని, కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి కోసం ప్రచారాన్ని ముమ్మరం చేసింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తిరగబడిన అల్లపురం గ్రామస్తులు
ఇదిలా ఉంటే మునుగోడులో దూకుడుగా ప్రచార పర్వాన్ని సాగిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి తాజాగా నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలం అల్లపురం గ్రామానికి వెళ్ళిన రాజగోపాల్ రెడ్డి ని గ్రామస్తులు నిలదీశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యమని గెలిపిస్తే, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా కాంట్రాక్టుల కోసం అమ్ముడు పోయావంటూ, ఈ ఎన్నికల లో పాల్గొనే అర్హత నీకు లేదంటూ మండిపడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

షాక్ అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .. ప్రత్యర్థి పార్టీల పనే అని ఆగ్రహం
ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందని భావించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా అల్లపురం గ్రామంలో ప్రజలు తిరుగుబాటు చేయడంతో షాక్ కు గురయ్యారు. గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించకుండానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెనుదిరిగారు. అయితే ఆందోళన చేసింది ప్రజలు కాదని, ప్రత్యర్థి పార్టీల నాయకులు కావాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఈ తరహా చర్యలకు దిగుతున్నారని బిజెపి నేతలు విమర్శిస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మునుగోడులో బిజెపి విజయం తథ్యం అని తేల్చి చెబుతున్నారు.

ఆందోళనలో బీజేపీ.. అసలేం జరుగుతుందని ఆరా!!
ఇప్పుడిప్పుడే ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఆదిలోనే హంసపాదు అన్నట్లు చౌటుప్పల్ మండలంలోని ఓ గ్రామంలో ప్రజలనుండి వ్యతిరేకత వ్యక్తం కావడం బీజేపీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తుంది. ప్రత్యర్థి పార్టీలు ప్రతీ మండలంలో ఇదే తరహా నిరసనలకు ప్లాన్ చేస్తారా? అన్నది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇది ప్రజల నుంచి వ్యక్తం అవుతున్న వ్యతిరేకతనో? ప్రజల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతనో ? తెలుసుకోవడానికి బిజెపి శ్రేణులు ఆరాతీస్తున్నాయి.

బీజేపీ అభ్యర్థికి ప్రత్యర్థి పార్టీల ప్రచారం ఎఫెక్ట్ ..
ఏది ఏమైనా బీజేపీ నేతలకు ఒకపక్క చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇప్పుడు బీజేపీలో చేరినా ఓటర్లకు కమలం గుర్తు రీచ్ అవుతుందా అన్న ఎన్నికల గుర్తు సమస్య ఇబ్బంది పెడుతుంటే, మరోపక్క నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారం, ఫలితంగా ఎదురవుతున్న పరిణామాలు కాస్త ఇబ్బందిగా తయారయ్యాయి. మరి వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్నదానిపై బిజెపి ముఖ్య నేతలు సమాలోచనలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications