మావోయిస్టులకు షాక్: భారీ ఎన్‌కౌంటర్‌లో 8మంది మావోయిస్టులు మృతి; తెలంగాణాలోనూ అలెర్ట్!!
మావోయిస్టులకు మరోమారు గట్టి దెబ్బ తగిలింది. ఇటీవల కాలంలో యాంటీ నక్సల్ ఆపరేషన్ జోరుగా సాగుతుంది. ఇక ఎన్ కౌంటర్ లలోనూ భారీగా మావోయిస్ట్ పార్టీకి ప్రాణ నష్టం జరుగుతుంది. తాజాగా మళ్ళీ చత్తీస్ గడ్ లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. నారాయణపూర్ జిల్లాలో పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు.
భారీ ఎన్ కౌంటర్... 8మంది మావోల మృతి
రెండు రోజులుగా చత్తీస్ గడ్ లోని అబుజ్ మడ్ లో భద్రత దళాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందగా, ఒక జవాన్ మృతి చెందినట్లు, మరో ఇద్దరికి గాయాలు అయినట్టు సమాచారం. నారాయణపూర్ జిల్లా అబుజ్ మడ్ ప్రాంతంలోనీ అటవీ ప్రాంతంలో డి ఆర్ జి,ఎస్ టిఎఫ్, కోబ్రా దళాలు సంయుక్తంగా నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ చేపట్టాయి.

రెండు రోజుల నుండి భీకర పోరు
ఈ క్రమంలోనే పోలీసులకు నక్సలైట్లకు మధ్య ఎదురు జరిగాయి. ఇక ఈ విషయాన్ని బస్టర్ ఐజి సుందర్ రాజ్ దృవీకరించారు. రెండు రోజుల నుండి ఎన్కౌంటర్ జరుగుతున్నట్టు అంతర్ జిల్లాల యాంటీ నక్సల్స్ దళాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా, ఎదురు కాల్పులు మొదలైనట్టు ఆయన తెలిపారు. రెండు రోజులుగా జరుగుతున్న భీకర పోరులో మరణాలు పెరిగే అవకాశం లేకపోలేదు.
ఎన్ కౌంటర్ పై బస్తర్ ఐజీ ప్రకటన
నారాయణపూర్, కొండగావ్, దంతేవాడ, కాంకేర్ లోని డిస్ట్రిక్టు రిజర్వ్ గార్డ్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ 53వ బెటాలియన్ కు చెందిన బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నట్టు బస్తర్ ఐజి వెల్లడించారు. అయితే ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్న క్రమంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. కాల్పుల తీవ్రతను బట్టి భారీగానే మావోయిస్టులు చనిపోయి ఉంటారని తెలుస్తోంది.
ఇటు తెలంగాణాలోనూ భద్రతా బలగాలు అలెర్ట్
అయితే ఈ రోజు సాయంత్రానికల్లా ఈ ఎన్కౌంటర్ కి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. మరోవైపు చత్తీస్ గడ్ లో కొనసాగుతున్న ఎన్కౌంటర్ నేపధ్యంలో ఇటు తెలంగాణా ఛత్తీస్ గడ్ అటవీ ప్రాంతాలలోనూ భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టాయి.












Click it and Unblock the Notifications