బీఆర్ఎస్ భవన్ ముట్టడి: ప్రారంభం నాడే ఢిల్లీలో కేసీఆర్ కు నిరసన సెగ!!
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ కు ప్రారంభం నాడే నిరసన సెగ తగలనుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై దాడి చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపగా దేశ రాజధాని ఢిల్లీలోనూ నిరసన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్ సభ్యులు ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ అంశంపై చర్చించాలని పట్టుబట్టారు.

కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ భవన్ ముట్టడి
ఇక ఈ క్రమంలో నేడు బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం నాడే బీఆర్ఎస్ భవన్ ముట్టడించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కిరాయి గుండాల మాదిరిగా పోలీసులు దాడి చేశారని, కాంగ్రెస్ వార్ రూమ్లో డేటాని ధ్వంసం చేశారని, తమ నేతలను, కార్యకర్తలను అరెస్టు చేసి ఎక్కడికి తీసుకు వెళ్లారో కూడా చెప్పటం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అరెస్టయిన వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ డేటా మొత్తం చోరీ
పోలీసుల ముసుగులో రౌడీలతో దాడి చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొత్తం డేటాని చోరీ చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇక రాష్ట్ర పోలీసు అధికారులు ఫోన్ చేసినా స్పందించడం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసులు పోలీసులా లేక దొంగలా అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం నాడు కాంగ్రెస్ పార్టీపై దాడి చేస్తారా? సునీల్ కనుగోలును అరెస్ట్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటూ ప్రశ్నించిన రేవంత్ రెడ్డి కెసిఆర్ అధికారాన్ని కాపాడుకోడానికి ఈ కుట్రలకు దిగుతున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ భవన్ ముట్టడితో ఢిల్లీలో కేసీఆర్ కు నిరసన సెగ
టిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం నాడే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడితో తెలంగాణ భవన్ నుండి వెళ్లి బిఆర్ఎస్ భవన్ ను ముట్టడిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఇక ఇదే సమయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, మండల కేంద్రాలలో కేసీఆర్ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏది ఏమైనా బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం నాడే కేసీఆర్ కు ఢిల్లీ కేంద్రంగా నిరసన సెగ తగులుతోంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి నేడు ఢిల్లీ కేంద్రంగా బి ఆర్ ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న కెసిఆర్ తొలి నాడే నిరసన ఎదుర్కోబోతున్నారు.












Click it and Unblock the Notifications