ఎమ్మెల్యే రాజాసింగ్ కు షాక్; మరో కేసు నమోదు.. ఎందుకంటే!!
వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరో షాక్ తగిలింది. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు శ్రీరామనవమి రోజున ఊహించని షాక్ తగిలింది. ఒకపక్క రాజాసింగ్ శ్రీరామనవమి వేడుకల్లో నిమగ్నమై ఉండగా ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదయింది. గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకు వెళ్లి వచ్చిన రాజాసింగ్ పై, మళ్లీ మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
జనవరి 28వ తేదీన ముంబైలో మాట్లాడిన రాజాసింగ్ ఓ సభలో విద్వేష ప్రసంగం చేసినందుకుగాను ఐపిసి సెక్షన్ 153ఏ 1(ఏ) కింద రాజా సింగ్ మీద కేసు నమోదు చేశారు. ముంబైలో రాజసింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే తెలంగాణ హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చే సమయంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయొద్దన్న విషయాన్ని కూడా నోటీసులలో గుర్తు చేశారు. అయితే నోటీసులు ఇచ్చిన పోలీసులు రాజాసింగ్ నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ విషయమై వివరణ ఇవ్వాలని కోరారు.

అయితే ముంబైలో రాజాసింగ్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలపై మంగళహాట్ పోలీసులు కూడా నోటీసులు జారీ చేశారు .ఇక ఆ నోటీసులకు రాజాసింగ్ వివరణ కూడా ఇచ్చారు. ధర్మం కోసం అవసరమైతే జైలుకు వెళ్తానని పేర్కొన్నారు. పోలీసులు కేసును నమోదు చేసినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. లవ్ జీహాద్ గురించి మాట్లాడినందుకే పోలీసులు కేసు పెట్టారని రాజాసింగ్ వెల్లడించారు. ధర్మం కోసమే తాను పోరాడుతున్నానని చెప్పిన రాజా సింగ్, దేనికైనా రెడీ అంటూ వ్యాఖ్యలు చేశారు.
కాగా గతంలో ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్లో కమెడియన్ మునావర్ ఫారుఖీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వీల్లేదని, ఆ షో కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై వ్యాఖ్యలు చేస్తూ రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడారు. అయితే రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం నేతలు ఆరోపించారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దీంతో రాజాసింగ్ పై నమోదైన కేసులను దృష్టిలో పెట్టుకొని ఆయనపై పిడి యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు. ఆపై గత సంవత్సరం 9వ తేదీన రాజాసింగ్ కు బెయిల్ మంజూరు కాగా ఆయన బయటకు వచ్చారు.












Click it and Unblock the Notifications