టాయిలెట్లు క్లీన్ చేసిన తెలంగాణ మంత్రి: షాకింగ్ మూమెంట్
తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో మరోసారి తనదైన శైలిలో వ్యవహరించి వార్తల్లో నిలిచారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో ఉన్న అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వయంగా టాయిలెట్లను శుభ్రం చేసి అధికారులు, సిబ్బందికి షాక్ ఇచ్చారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో కనీస పరిశుభ్రత పాటించకపోవడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన ఆయన, అక్కడి మరుగుదొడ్లు అత్యంత అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించారు. దీంతో కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతూ, తానే స్వయంగా బకెట్ లో నీళ్లతో మరుగుదొడ్లను శుభ్రం చేశారు. దుమ్ము పేరుకుపోయిన గోడలపై నీళ్లు చల్లి క్లీన్ చేశారు. మంత్రి స్వయంగా రంగంలోకి దిగడంతో అక్కడి అధికారులు ఏం చేయాలో పాలుపోక చూస్తుండిపోయారు.

ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నిరంతరం కార్యాలయాలను పర్యవేక్షిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇలాంటి బాధ్యతారాహిత్యం తగదని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రజా సేవే లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వ కార్యాలయాల్లో కనీస సౌకర్యాలు, పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించకపోతే సామాన్య ప్రజలు ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. ఇకపై విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందితో పాటు సంబంధిత అధికారులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన ప్రాథమిక బాధ్యత స్థానిక అధికారులపై ఉందని జూపల్లి గుర్తుచేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. నిర్లక్ష్య వైఖరి వీడి, ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో సేవలు అందించాలని సూచించారు. ఈ సంఘటన ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ తీరు మారాల్సిన అవసరాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చినట్టయింది.













Click it and Unblock the Notifications