
పడకేసిన తెలంగాణా: ఏ తలుపు తట్టినా జ్వర బాధితులే; ఫీవర్ సర్వేలో షాకింగ్ విషయాలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్యం పడకేసింది. ఏ తలుపు తట్టిన జ్వరం జలుబు దగ్గు అంటూ బాధితులే కనిపిస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఫీవర్ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా కరోనా తరహా లక్షణాలతో బాధపడుతున్న బాధితులు ప్రధానంగా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఫీవర్ సర్వే లో దాదాపు రెండు లక్షల మందికి చేరువగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించినట్టు సమాచారం. తెలంగాణా రాష్ట్రంలో అధికారికంగా నమోదవుతున్న కరోనా కేసులు మాత్రమే కాకుండా అనధికారికంగా ఉన్న కరోనా కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తాజా ఫీవర్ సర్వేతో తెలుస్తుంది. కొందరు పరీక్షలు కూడా చేయించుకోని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది.
Recommended Video
5సంవత్సరాల లోపు పిల్లలకు మాస్కులు సిఫార్సు చెయ్యలేదు: కేంద్రం సవరించిన మార్గదర్శకాలు

జ్వర సర్వే చేస్తున్న వైద్య బృందాలకు షాక్ .. ఏ ఇంట్లో చూసినా జ్వర బాధితులే
జ్వర సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టిన వైద్య బృందాలు సర్వే చేస్తున్న క్రమంలో షాక్ కు గురవుతున్నారు. ఏ ఇంట్లో చూసినా అనారోగ్యంతో బాధపడుతున్న వారే దర్శనమిస్తున్నారు. ఇంటింటికి ఆరోగ్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐదో విడత సర్వే మూడు రోజులుగా కొనసాగుతుంది. ఇంటికి వెళ్లిన ఆరోగ్య కార్యకర్తలు, ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యపరిస్థితిపై వివరాలను సేకరించి, వారికి అనారోగ్యం ఉన్నట్లయితే సంబంధిత మందుల కిట్లో అక్కడికక్కడే అందజేసి వారిని హోం క్వారంటైన్ లో ఉండాల్సిందిగా సూచిస్తున్నారు.

మూడు రోజుల్లో 1,78,079 మందిని జ్వరం, జలుబు, గొంతు నొప్పి బాధితులుగా గుర్తింపు
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 42. 30 లక్షల ఇళ్లకు వెళ్లిన సర్వే బృందాలు 1,78,079 మందిని జ్వరం, జలుబు, గొంతు నొప్పి, దగ్గు వంటి ఇతర లక్షణాలతో బాధపడుతున్న వారిగా గుర్తించాయి. వీరందరికీ మెడికల్ కిట్ లను అందించారు. రాష్ట్రంలో జ్వర సర్వే యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. ఇప్పటివరకు వివిధ జిల్లాల్లో నిర్వహించిన ఫీవర్ సర్వే వివరాలను చూస్తే షాక్ కు గురి కావాల్సిందే. లక్షల సంఖ్యలో ప్రజలు జ్వర పీడితులుగా మారారని సర్వే చెప్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ని జిల్లాలలోనూ అదే పరిస్థితి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో1,03,021 ఇళ్లలో ఫీవర్ సర్వేను నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,30,558 ఇళ్లలో ఫీవర్ సర్వేను నిర్వహించారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 5,41,763 ఇళ్లలో ఫీవర్ సర్వేను నిర్వహించారు. ఇక ఖమ్మం జిల్లాలో 1,33, 150 ఇళ్ళలో ఫీవర్ సర్వేను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఏ జిల్లాలో చూసినా ఒకే విధమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఇంట్లోనూ అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లు, జ్వరంతో మంచం పట్టిన వాళ్ళు ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది.

వ్యాక్సిన్స్ రెండు డోసులు తీసుకున్నా సరే కరోనా లక్షణాలు; సర్వత్రా ఆందోళన
కరోనా రెండు వ్యాక్సిన్లు, పూర్తి డోసులు తీసుకున్నప్పటికీ తాము ఆరోగ్యం బారిన పడ్డామని కొందరు వాపోతున్నారు. అయితే ఇంటికి వెళుతున్న ఆరోగ్య కార్యకర్తలు, రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో తమ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో కొందరు కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ ఆరోగ్య కార్యకర్తలు ప్రశ్నిస్తున్న క్రమంలో వారికి సమాధానం చెప్పకుండా దాచి పెడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఏకంగా కొందరైతే బయట తిరుగుతూ మరింత వ్యాప్తి చేస్తున్న పరిస్థితులు కూడా లేకపోలేదు.