టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో 37 మందిపై ఛార్జీషీట్ రెడీ?: రమేష్ అరెస్టుతో కీలక మలుపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అధికారులు దర్యాప్తు వేగం పెంచారు. కాగా, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు వరంగల్ జిల్లాకు చెందిన డీఈ పూల రమేష్ అరెస్టుతో కీలక మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఈ కేసులో సిట్ 50 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో 15 మంది బెయిల్‌పై విడుదలయ్యారు.
ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ జైల్లోనే ఉన్నారు. ఈ కేసులో 37 మంది నిందితుల పేర్లతో ఛార్జీషీట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఏఈ ప్రశ్నపత్రాలను లీక్ చేసిన ఎన్డీపీడీసీఎల్ డీఈ పూల రమేష్ అరెస్టు తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తన భార్య పేరిట హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్ నడుపుతున్న రమేష్ ఏకంగా 80 మందికి ఏఈ ప్రశ్నపత్రం అమ్మినట్టు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. ఆ 80 మంది ఎవరు..? వారి వివరాలేంటి..? ఎవరెవరు ఎంతకు క్వశ్చన్ పేపర్ కొనుగోలు చేశారు..? అనే కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది. వాళ్లెవరో తేలితే అరెస్టు చేసేందుకు సిట్ రెడీ అవుతోంది.
దీంతో లీకేజీ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అభియోగపత్రం సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది సిట్. పూల రమేష్ నుంచి ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన వారి పేర్లతో తర్వాత అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ జూన్ 11నే
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష యథాతథంగా జరగనుంది. ఎందుకంటే, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రద్దయిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 11న జరగనున్న విషయం తెలిసిందే.
ఇది ఇలావుండగా, తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు హాల్ టికెట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో 503 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి జూన్ 11న నిర్వహించతలపెట్టిన ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ల్ నేటి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థుల వివరాల ర్యాండమైజేషన్ తర్వాత వీటిని వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆదివారం అంటే జూన్ 4 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది.
జూన్ 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల పరీక్ష జరగనుంది. అక్టోబర్ 16 నాటి పరీక్ష కోసం డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లు ఇప్పుడు పనిచేయవని.. తాజాగా మళ్లీ తీసుకోవాలని కమిషన్ సూచించింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై వారం రోజులుగా టీఎస్‌పీఎస్సీ బోర్డ్ సమాలోచనలు చేసి.. ఈ నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో 503 గ్రూప్-1 సర్వీసుల ఉద్యోగాలకు గత ఏడాది ఏప్రిల్‌లో కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 3.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. గత అక్టోబర్ 16న జరిగిన ప్రిలిమినరీ పరీక్షను ప్నశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జూన్ 11న నిర్వహించనున్న రెండున్నర నెలల క్రితం ప్రకటించింది.












Click it and Unblock the Notifications