టీఎస్‌పీఎస్సీ సభ్యులకు సిట్ నోటీసులు, ఛైర్మన్‌కు కూడా?: రేవంత్ ఆరోపణలపై స్పందన
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా కమిషన్‌లో పనిచేసే కొంతమంది సభ్యులను కూడా విచారించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డికి తాజాగా శుక్రవారం నోటీసులు జారీ చేశారు.
అనితా రామచంద్రన్, లింగారెడ్డి దగ్గర నిందితులు ప్రవీణ్, రమేష్‌లు పీఏలుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దర్నీ సిట్ అధికారులు విచారించి వాంగ్మూలం నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ కేసులో ఇప్పటికే ప్రవీణ్, రమేష్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.
మరోవైపు, ఈ కేసులో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ఛైర్మన్, కార్యదర్శి నుంచి సిట్ అధికారులు వివరాలు సేకరించారు. మరోవైపు, ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్నాపత్రాలు ఉన్నట్లు తేలింది.

రేవంత్ ఆరోపణలపై స్పందించిన సిట్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై సిట్ అధికారులు స్పందించారు. తాము ఎవరికీ డేటా ఇవ్వలేదని.. కోర్టుకు నివేదికను ఇస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 100 మంది కంటే ఎక్కువ అభ్యర్థుల విచారణ పూర్తి చేశామని, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బోర్డ్ సభ్యులకు నోటీసులు ఇచ్చామని తెలిపారు.
బోర్డు ఛైర్మెన్, సెక్రెటరీ వాగ్మూలం రికార్డ్ చేస్తామన్నారు.ఇప్పటికే లింగా రెడ్డికి నోటీసు జారీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేసిన రమేష్ ఇచ్చిన వాగ్మూలంతో లింగా రెడ్డికి నోటీసులు పంపినట్లు సిట్ అధికారులు తెలిపారు. ఈ కేసులో 14 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని.. అందులో నాలుగు లక్షలు సీజ్ చేశామని సిట్ అధికారులు వెల్లడించారు.
పేపర్ లీక్ కేసులో నిందితులకు కేటీఆర్ కు సంబంధమేంటని.. అసలు కేటీఆర్‌కు ఎగ్జామ్ డేటా ఎలా వచ్చిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అధికారులు కాకుండా కేటీఆర్ కు డేటా ఎవరిచ్చారో ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు రేవంత్. పేపర్ లీక్ కేసులో కావాల్సిన వాళ్లను కాపాడేందుకే సిట్ ఏర్పాటు చేశారని రేవంత్ ఆరోపించారు. గతంలో ఇలాగే సిట్ ఏర్పాటు చేసిన కేసులన్నీ తప్పుదోవపట్టించారని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం ఇరుకున పడ్డప్పుడల్లా సిట్‌ను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.పేపర్ లీక్ కేసులో ఏ1గా శంకర్ లక్ష్మీని చేర్చాలని డిమాండ్ చేశారు. శంకర్ లక్ష్మీకి తెలియకుండా ఏం జరగదన్నారు. ఆర్థిక పరమైన నేరారోపణలున్నప్పుడు కేసును ఈడీతో విచారణ జరిపించాలన్నారు రేవంత్. పేపర్ లీక్ కేసుపై ఢిల్లీలో సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు సిట్ సీజ్ చేసిన వాటిని ఈడీ తీసుకోవాలన్నారు రేవంత్. అంతేగాక, కేటీఆర్ పైనా విమర్శలు గుప్పించారు. కేటీఆర్ పరువు వంద కోట్లు అని ఎలా నిర్ణయించారన్నారు. వంద కోట్లు చెల్లిస్తే ఏమైనా అనవచ్చా? అని రేవంత్ అన్నారు.












Click it and Unblock the Notifications