రంగారెడ్డి జిల్లాలో లారీ బీభత్సంలో ఆరుగురు మృతి, విషమంగా పలువురి పరిస్థితి!
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునే వారిపైకి ఒకసారిగా దూసుకు వెళ్లిన లారీ పలువురి ప్రాణాలు తీసింది. చేవెళ్ల మండలం ఆలూరు గేట్ దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.
లారీ బీభత్సం.. ఆరుగురు దుర్మరణం , పలువురి పరిస్థితి విషమం
అయితే ఇప్పటివరకు ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని మరో ఏడుగురు పరిస్థితి విషమం విషమంగా ఉందని తెలుస్తుంది. ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులందరూ కూరగాయలు అమ్ముకుంటున్న వారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 50 మందికి కాళ్లు చేతులు విరగడంతో అక్కడ బీతావాహ పరిస్థితి నెలకొంది.

లారీ వేగానికి కుప్పకూలిన భారీ వృక్షం
బాధితులందరూ నడవలేని పరిస్థితికి చేరుకుని హాహాకారాలు చేశారు. ఇక ఈ సంఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మితిమీరిన వేగంతో వచ్చిన లారీ ధాటికి అక్కడ ఉన్న ఓ భారీ వృక్షం సైతం కుప్పకూలింది. ఇక లారీ క్యాబిన్లో డ్రైవర్ చిక్కుకుపోగా, అక్కడ పరిస్థితి దారుణంగా కనిపించింది. అయితే ఈ ఘటనలో మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
కూరగాయలు అమ్ముకునే వారిపైకి దూసుకెళ్లిన లారీ
హైదరాబాద్ బీజాపూర్ హైవేపై జరిగిన ఈ ఘటనలో లారీ సృష్టించిన బీభత్సాన్ని చూసిన అక్కడివారు ఒక్కసారిగా వణికిపోయారు. అప్పటివరకు కూరగాయలు అమ్ముకుంటూ, కూరగాయలు కొనుక్కుంటూ సందడిగా ఉన్న ఆ ప్రాంతమంతా రక్తపు మడుగు తో నిండిపోయింది. ఇక గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్టు సమాచారం.
అతి వేగమే ప్రమాదానికి కారణం అంటున్న ప్రత్యక్ష సాక్షులు
అయితే ఈ ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో లారీ డ్రైవర్ వాహనాన్ని నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ఘోరం జరిగిందని చెబుతున్నారు. ఇప్పటివరకు చనిపోయిన వారిలో ఆలూరు కి చెందిన రాములు, ప్రేమ్, ఖానాపూర్ కు చెందిన సుజాతలను గుర్తించారు. మిగతా వారిని గుర్తించవలసి ఉంది.పోలీసులు ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications