SLBC Tunnel: నేడు ఘటనా స్థలికి సీఎం రేవంత్ రెడ్డి.. తాజా పరిస్థితి ఇలా!
ఎస్ ఎల్ బీసీ టన్నెల్ వద్ద 9వ రోజు ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ రెస్క్యూ ఆపరేషన్లో నేడు ఏ క్షణమైనా గల్లంతయిన వారిలో పలువురు ఆచూకీ లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జి పి ఆర్ రాడార్ డేటా మార్క్ చేసిన చోట జరుగుతున్న తవ్వకాలు తుది దశకు చేరుకున్నాయి. అయితే ఈ తవ్వకాలలో కనీసం కొంతమంది ఆచూకీ అయిన లభించే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
కొనసాగుతున్న టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో షిఫ్టులో 120 మంది సిబ్బంది చొప్పున పనిచేస్తున్నారు. ఇక మరోవైపు దోమల పెంట వద్ద అందుబాటులో క్రిటికల్ కేర్ అంబులెన్స్ లను ఉంచారు . వీరి ఆచూకీ దొరికితే తదుపరి చర్యలకు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉంది.

మృత దేహాల వెలికితీతకు యత్నాలు
నేడు మెషిన్ ముందు భాగంలో ఉన్న నాలుగు మృతదేహాలను గుర్తించిన అధికారులు వాటిని బయటకు తీసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ భాగంలో మట్టి గట్టిపడింది. అయినా తవ్వకాలు జరిపి మృత దేహాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మిషన్ క్రింది భాగంలో నాలుగు మృత దేహాలు ఉన్నాయని, వాటిని బయటకు తీయటం కోసం మిషన్ భాగాలను కట్ చేస్తున్నామని చెప్పారు.
నేడు ఎస్ఎల్ బీసీ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి
ఇదిలా ఉంటే నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు వెళుతున్న సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనలో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళతారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకుంటారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి పర్యటన ముగించుకుని రోడ్డు మార్గం ద్వారా ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు రానున్నారు.
రేవంత్ ను టార్గెట్ చేసిన బీఆర్ఎస్
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఐజి సత్యనారాయణ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఎస్ ఎల్ బి సి ఘటన జరిగి ఇన్ని రోజులైనా సంఘటన స్థలానికి వెళ్లలేదని ప్రతిపక్ష బి ఆర్ ఎస్ రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్న వేళ నేడు సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళుతుండడం గమనార్హం.












Click it and Unblock the Notifications