మూర్ఖుడా! నీకు ఐదెకరాలు, ప్రజలకు వద్దా: కెటిఆర్ పేరుచెప్పి జగన్‌ని ఏకేసిన సోమిరెడ్డి
హైదరాబాద్: రాజధాని అమరావతి శంకుస్థాపనకు తనను పిలవవద్దని, పిలిచినా రానని ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం మండిపడ్డారు.
రాజధాని అమరావతి శంకుస్థాపనకు తాను రానని ఖరాఖండిగా జగన్ చెప్పడం సరికాదన్నారు. తెలంగాణ మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ఆహ్వానిస్తే వస్తామని చెప్పారని, అలాంటప్పుడు ప్రతిపక్ష నేత రానని చెప్పడం మంచిది కాదన్నారు.
వైసిపిలో గందరగోళానికి ఇదో నిదర్శనమన్నారు. జగన్ ఒక మూర్ఖుడిలా వ్యవహరిస్తున్నారని భగ్గుమన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజధాని భూసేకరణ పైన రాద్దాంతం చేసినా, రాజకీయం చేసినా రైతులు వారికి మద్దతు పలకలేదన్నారు.

అమరావతి శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ వంటి వారు వస్తుంటే.. పానకంలో పుడకలా జగన్ రానని చెప్పడం విడ్డూరమన్నారు. కేవలం జగన్‌కు అతిపెద్ద లోటస్ పాండ్ కావాలి కానీ, ఏపీ ప్రజలకు పెద్ద రాజధాని వద్దా అని ప్రశ్నించారు.
జగన్ ఏం ఆలోచిస్తున్నారో ఆయనకే తెలియడం లేదన్నారు. రాజకీయాలు ఎన్ని ఉన్నప్పటికీ.. తెలంగాణ మంత్రి కెటిఆర్ మాత్రం అమరావతికి ఆహ్వానిస్తే వస్తామని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నారు.
కెటిఆర్ ఓ పద్ధతిగా మాట్లాడారని చెప్పారు. జగన్‌కు ఆయన జ్యోతిష్కుడు ఏమైనా వెళ్లవద్దని చెప్పారా అని నిలదీశారు. లేదంటే మీ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు వద్దని చెప్పారా అన్నారు. జగన్ కుటుంబం నివసించేందుకు హైదరాబాదులో ఐదు ఎకరాలు కావాలి కానీ, ఐదు కోట్ల మందికి 33 ఎకరాలు వద్దా అని నిలదీశారు.












Click it and Unblock the Notifications