మహేష్ బాబులా కొడుకు దిద్దిన కాపురం: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి
హైదరాబాద్: ఇది కొడుకు దిద్దిన కాపురం. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఓ కుమారుడు అచ్చం సినిమాలో మాదిరిగా తన తల్లిదండ్రులను కలిపాడు. వారిద్దరికీ మళ్లీ పెళ్లి చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చెల్‌లో జరిగింది. మహేష్ బాబు కొడుకు దిద్దిన కాపురం సినిమాలో తల్లీదండ్రులను ఒకటి చేసినట్లు, సిద్ధార్థ్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో తల్లిదండ్రులను ఏకం చేసినట్లు ఓ కుమారుడు నిజజీవితంలో తన తల్లిదండ్రులను ఏకం చేశాడు.
దాదాపు 20 ఏళ్ల క్రితం విడిపోయిన తల్లిదండ్రులను వారి కుమారుడు ఒక్కటి చేశాడు. అంతేకాకుండా బంధుమిత్రుల సమక్షంలో మళ్లీ ఘనంగా వివాహం జరిపించాడు. శామీర్‌పేటకు చెందిన సతీశ్వర్‌రెడ్డి(55),సంగీత(50) వివాహం 1986లో అయింది. వారికి శంతన్‌రెడ్డి అనే కుమారుడు పుట్టాడు. అతడికి ఏడు సంవత్సరాల వయసులో (1996లో) ఆ దంపతులు విడిపోయి వేర్వేరుగా జీవితం కొనసాగించారు.

శంతన్‌రెడ్డి తన తల్లి దగ్గరే పెరిగాడు. అమెరికాలో ఉన్నత చదువు పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అయితే, అమ్మానాన్నలను కలిపే లక్ష్యంతో అతను ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు వారిని ఒప్పించాడు. తల్లిదండ్రులు కలిసి ఉండటానికి అంగీకరించడంతో యూఎస్ నుంచి వచ్చి మేడ్చల్, శామీర్‌పేట సరిహద్దులో ఉన్న క్షేత్రగిరి గుట్టపై స్వామివారి సమక్షంలో ఆదివారం వారికి ఘనంగా వివాహం జరిపించాడు.
ఈ పెళ్లివేడుకకు బంధుమిత్రులు, కుటుంబసభ్యులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. శంతన్‌రెడ్డిని అభినందించారు. కొడుకు చేసిన ఈ పెళ్లి, తమను కలపడానికి అతడు తపించిన తీరు ఎంతో ఆనందం కలిగించిందని సతీశ్వర్ రెడ్డి, సంగీత తెలిపారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డి, కాంగ్రెస్ పీసీసీ ప్రధానకార్యదర్శి ఉద్దమర్రి నర్సింహారెడ్డ్డి తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications