తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ అప్పుడే
తెలంగాణ రాష్ట్రంలో జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. మే నెలఖారునే కేరళను రుతుపవనాలు తాకనున్నాయి. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం ఐదారు రోజుల సమయం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
జూన్ 5-8 తేదీల మధ్య నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కొంత ఆలస్యమైతే జూన్ రెండో వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. కాగా, గతేడాది కేరళకే జూన్ 11న వచ్చాయి. తెలంగాణలో విస్తరించే సమయం 20వ తేదీ దాటిన విషయం తెలిసిందే.

అయితే, మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండటంతో ఈ ఏడాది నైరుతి రుతువపనాలతో సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలున్నాయి. నైరుతి రుతుపవన గమనం ఆశాజనకంగా ఉందని జూన్ 11వ తేదీలోపే రాష్ట్రానికి వస్తాయన్న అంచనాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్త శ్రావణి తెలిపారు.
కాగా, మే మొదటి వారం నుంచే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. మార్చి, ఏప్రిల్ నెలలో ఎండలు మండిపోగా.. మే నెలలో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో రాజధాని హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లోనూ వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు ఎండలు, వడగాలుల నుంచి ఉపశమనం పొందారు. అయితే, చాలా చోట్ల చేతికి వచ్చిన పంట, ధాన్యం నీట మునిగింది. దీంతో రైతుుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, తడిసిన వరి ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications