కెసిఆర్ ఫాంహౌస్‌లో కోట్లు దాచారు: దామోదర ఆరోపణ
సంగారెడ్డి:తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫాంహౌస్‌లో కోట్ల రూపాయలు దాచారని, వాటిని గురించి పోలీసులు పట్టించుకోవడం లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెసు నాయకుడు దామోదర రాజనర్సింహ అన్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికలో పోలీసులు తెరాసకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర మంత్రి హరీష్ రావుకు పోలీసు రక్షణ కల్పిస్తూ కాన్వాయ్‌తో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారని ఆయన చెప్పారు. కెసిఆర్ ఓ నియంతలా మారారని దుయ్యబట్టారు. ఇది ప్రజాస్వామ్యదేశమా, కాదా అని ఆయన ప్రశ్నించారు. తెరాస శాసనసభ్యులే డబ్బులు పంపిణీ చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని అన్నారు.
ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటే ప్రజలు తిరగబడుతారని ఆయన చెప్పారు. ఈ విషయాలను మీడియా ప్రజలకు తెలియజేయాలని ఆయన కోరారు. గంగాధర్ అనే రిటైర్డ్ ఉద్యోగి తనింట్లో సొంత డబ్బు దాచుకుంటే పోలీసులు భయబ్రాంతులకు గురి చేసి ఇంట్లోకెళ్లి బీరువా ధ్వంసం చేసి డబ్బులు లాక్కొచ్చారని ఆయన ఆరోపించారు.
మెదక్ జిల్లా ఎస్పీ సుమతిపై దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. నారాయణఖేడ్ ఉప ఎన్నిక విషయంలో సుమతి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్త మాదిరిగా పనిచేస్తున్నారని ఆయన ఆరోిపంచారు. నారాయణఖేడ్ ఉపఎన్నికల్లో మంత్రి హరీష్‌రావు, డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దామోదర రాజనర్సింహ ఆరోపించారు. కోట్ల రూపాయలు పంచుతూ కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. జిల్లా ఎస్పీ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారని రాజనర్సింహ మండిపడ్డారు.
తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ఏకంగా పోలీసు వాహనాల్లోనే డబ్బులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. నిష్పాక్షికంగా ఎన్నిక జరిపేందుకు ఎన్నికల కమిషన్ అన్ని చర్యలూ తీసుకోవాలని ఆయన కోరారు.

నారాయణఖేడ్ శాసనసభా స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెసు పార్టీ గెలుపు బాధ్యతను దామోదర రాజనర్సింహ తీసుకున్నారు. కాంగ్రెసు సిట్టింగ్ స్థానమైన నారాయణఖేడ్‌లో దివంగత ఎమ్మెల్యే పి. కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి కాంగ్రెసు తరఫున పోటీ చేస్తున్నారు.
తెరాస, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా రంగంలో ఉన్నారు. నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 13వ తేదీన పోలింగ్, 16వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.












Click it and Unblock the Notifications