శ్రీతేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
పుష్ఫ-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు శనివారం రాత్రి తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ సాయం లేకుండా శ్రీతేజ్ శ్వాస తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
అయితే, బాలుడికి అప్పుడప్పుడు జ్వరం వస్తోందని.. శుక్రవారంతో పోల్చితే నేడు శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడినట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. ఫీడింగ్ కూడా తీసుకుంటున్నాడని చెప్పారు. కాగా, శ్రీతేజ్ కళ్లు తెరిచాడని.. అయితే ఎవరినీ గుర్తు పట్టడం లేదని శుక్రవారం వైద్యులు తెలిపిన విషయం తెలిసిందే.

మరోవైపు, శ్రీతేజ్ వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటనపై చర్చ జరిగిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి అసెంబ్లీ నుంచి నేరుగా కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. వ్యక్తిగతంగా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల సాయం ప్రకటించారు.
అల్లు అర్జున్ ప్రెస్‌మీట్
సినీనటుడు అల్లు అర్జున్ కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ ప్రముఖులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టడంపై ఆసక్తి నెలకొంది.
అల్లు అర్జున్ తన నివాసంలోనే మీడియాతో మాట్లాడనున్నారు. తనపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు అల్లు అర్జున్ వివరణ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో అల్లు అర్జున్ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సంధ్య థియేటర్ ఘటనపై ఇప్పటికే పలుమార్లు అల్లు అర్జున్ స్పందించిన విషయం తెలిసిందే. రేవతి మృతి బాధ కలిగించిందన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. రూ. 25 లక్షల సాయాన్ని ప్రకటించారు. కేసు కోర్టులో ఉన్నందున న్యాయ నిపుణుల సూచన మేరకే తాను కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను కలవలేకపోయానని చెప్పారు.
కాగా, పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రస్తావించగా.. దీనిపై సీఎం రేవంత్ స్పందించారు. ఆ రోజు జరిగిన ఘటనను వివరిస్తూ.. విపక్ష పార్టీలు, సినీ ప్రముఖులపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
సంధ్య థియేటర్ ఘటనలో ఒకరి ప్రాణం పోయిందని, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని సీఎం రేవంత్ చెప్పారు. అతడ్ని ఎవరు పట్టించుకోవడం లేదని, బాధితుల కుటుంబంపై సానుభూతి వ్యక్తం చేయడం లేదని మండిపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి గురించి పట్టించుకోకుండా.. బెయిల్ పై విడుదలైన హీరోను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు క్యూ కట్టారని ధ్వజమెత్తారు. థియేటర్ ఘటనలో ప్రాణాలు పోయాయని చెప్పినా.. అల్లు అర్జున్ సినిమా చూసే వెళతానని పోలీసులకు చెప్పినట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. ఇప్పటికీ బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌పై ఆసక్తిక నెలకొంది. సీఎం చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ స్పందించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications