శ్రీరామనవమి వేడుకలు.. అయోధ్య, భద్రాచలంలో అట్టహాసంగా.. వేములవాడలో ప్రత్యేకంగా!!
దేశవ్యాప్తంగా ఈ రోజు శ్రీరామ నవమి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. నేడు శ్రీరామనవమి సందర్భంగా ఆదర్శమూర్తి అయిన శ్రీరాముని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. వాడవాడలా సీతారామ కళ్యాణాన్ని జరిపించి లోక కళ్యాణం కోసం ఆ రామయ్యను ప్రార్థిస్తారు. ఈరోజు దేశమంతా జై శ్రీరామ్ అంటూ భక్తి భావంతో నిండిపోతుంది. లోక కళ్యాణం కోసం రామయ్య కళ్యాణం వాడవాడలా జరిపించటం ఆనవాయితీగా వస్తుంది.
అయోధ్యతో పాటు దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు
శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలోని భవ్య రామ మందిరంలో తొలిసారి శ్రీరామ నవమి ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. నేడు అయోధ్యలో రామయ్యను దర్శించుకోవటం కోసం 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంతో పాటు రాష్ట్రంలోని ఇతర రామాలయాలు, ఆంజనేయ ఆలయాల్లో నవమి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు.

భద్రాద్రిలో నేడు నవమి వేడుకలిలా..
భద్రాచలంలో ఉదయం సీతారాముల కళ్యాణం అనంతరం శ్రీరాముల వారి పట్టాభిషేకం నిర్వహించనున్నారు. భద్రాచలంలోని రామాలయంలో ఈ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సీతారామచంద్ర స్వామికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి దంపతులు పట్టు వస్త్రాలు, స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. శ్రీరాముల వారి మహా పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ దంపతులు హాజరవుతారు.
వేములవాడలో నేడు ఘనంగా నవమి వేడుకలు
ఇక దక్షిణ కాశీగా పేరందిన ప్రసిద్ధ శైవ క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో సీతా రామచంద్రస్వామి కళ్యాణోత్సవానికి ఆలయం ఘనంగా ముస్తాబైంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో భద్రాద్రిని తలపించే రీతిలో సీతారామచంద్రస్వామి కళ్యాణ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
Bhadradi Ramudu Kalyanam 🙏#BhadraChalam pic.twitter.com/4XAewfxefC
— . (@_TarakTweets) April 17, 2024
జానకీరాముల కళ్యాణం.. వేములవాడలో శివపార్వతుల వివాహం
ఈరోజు ఉదయం 11-59 గంటలకు సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. సీతా రాముల కళ్యాణం తిలకించడం కోసం వేలాది మంది భక్తులు రాజన్న క్షేత్రానికి తరలివస్తున్నారు. జానకీరాముల కళ్యాణం సందర్భంగా శివుడిని వివాహమాడి ఆనవాయితీ ఉన్న వేలాదిమంది శివ పార్వతులతోపాటు భారీ సంఖ్యలో హిజ్రాలు వేములవాడలో సందడి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications